20 నుంచి మరోసారి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): ఈ నెల 20 నుంచి 22 వరకు డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ధ్రువపత్రాలను పునఃపరిశీలించనున్నారు. మొత్తం 393 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను మరోసారి రీవెరిఫికేషన్ చేయనున్నారు. హైదరాబాద్ దోమలగూడలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో అభ్యర్థులు హాజరు కావాలని అధికారులు సూచించారు.
ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంటూ బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇవీ నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. నకిలీ సర్టిఫికెట్లు పెట్టి స్పోర్ట్స్ కోటాలో కొంత మంది ఎంపికైనట్టు ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసు కుంది. గతంలో స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 393 మంది అభ్యర్థులుంటే అందులో ఇంటర్నేషనల్ (ఫామ్1), నేషనల్ (ఫామ్2) స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఉన్న కొంత మంది మాత్రమే టీచర్ ఉద్యోగాలు పొందారు.
ఫామ్-3 స్టేట్, ఫామ్-4 డిస్ట్రిక్ట్, జోన్, డివిజన్ స్థాయి క్రీడల్లో రాణించిన వారికి సైతం అవకాశమివ్వాలని అభ్యర్థులు కోరడంతోపా టు కొంత మంది నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందారని ప్రభుత్వానికి ఫిర్యాదులందడంతో మరోసారి అందరికీ రీవెరిఫికేషన్ నిర్వహించాలని నిర్ణ యించారు.