calender_icon.png 22 October, 2024 | 12:14 PM

ఆర్డీవో ఆఫీస్‌ను ముట్టడించిన దళితులు

22-10-2024 01:05:37 AM

డప్పులు కొడుతూ నిరసన 

డబుల్ బెడ్‌రూం ఇళ్లు 

కేటాయించాలని డిమాండ్

సిరిసిల్ల, అక్టోబర్ 21: సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌ను సోమవారం దళితులు ముట్టడించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆశ చూపి, భూములు తీసుకుని ముఖం చాటేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన వందమంది దళితులు కార్యాలయానికి డప్పులు కొట్టుకుంటూ వచ్చి ఆఫీస్ ఎదుటకు ఆందోళనకు దిగారు. యాభై ఏళ్ల క్రితం  అప్పటి ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రైవేట్ భూమిని కొని, ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. పట్టాలు అందించడంతో పాటు హడ్కో స్కీం ద్వారా కంట్రిబ్యూషన్ కింద లబ్ధిదారులు బేస్‌మెంట్ నిర్మాణం చేసుకుంటే ఇండ్ల నిర్మాణం చేశామన్నారు. ఇండ్లు అసంపూర్తిగా ఉండటం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో వేరే చోట ఉంటున్న ట్టు తెలిపారు. నర్సింగ్ కాలేజీ, అంబేద్కర్ భవన నిర్మాణాలకు స్థలం ఇస్తే, వేరే ప్రదేశంలో డబుల్ బెడ్ రూమ్‌లు కట్టి ఇస్తామని అప్పటి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి, తమ స్థలాన్ని లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. ఇప్పుడు అధికారులు కేవలం 100 మం దికి మాత్రమే ఇస్తామని కొర్రీలు పెడుతున్నారని వాపోయారు. అర్హులైన వారందరికి డబుల్ బెడ్‌రూమ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.