నవంబర్ నెలలో 8 టన్నుల బంగారం కొన్న కేంద్ర బ్యాంక్
ముంబై: వివిధ దేశాల్లోని కేంద్ర బ్యాంకులు వ్యూహాత్మకంగా తమ బంగారం నిల్వలను పెంచుకొంటున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కూడా దూకుడు కొనసాగిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో వివిధ కేంద్ర బ్యాంకులన్నీ కలిపి 53 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా ఆర్‌బీఐ సైతం 8 టన్నుల బంగారం కొనుగోలు చేసింది.
తద్వారా నవంబర్ నెలలో బంగారం నిల్వల్లో మూడో అతిపెద్ద బ్యాంక్‌గా నిలవడంతో పాటు తన నిల్వలను మరింత పెంచుకుందని ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) సోమవారం తెలిపింది. యుద్ధాలు, అధిక ద్రవ్యోల్బణం, ఇతర సవాళ్లను పరిగణనలోకి తీసుకుని రిస్క్‌ను తగ్గిం చుకునేందుకు కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకునేందుకు ఆసక్తి చూపుతుంటాయి.
అలా 2024లో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చెందిన కేంద్ర బ్యాంకులు ఈ విషయంలో ముందున్నాయి. నవంబర్ నెలలో కేంద్ర బ్యాంకులు మొత్తం 53 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు డబ్ల్యూజీసీ తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో నవంబర్ నెలలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో కేంద్ర బ్యాంకులు దీన్ని అవకాశంగా మలుచుకున్నాయి.
గత ఏడాది నవంబర్ వరకు ఆర్బీఐ మొత్తం 73 టన్నుల బం గారాన్ని కొనుగోలు చేసింది. తన నిల్వలను 876 టన్నులకు పెంచుకుంది. 2024లో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసిన పోలాండ్ తర్వాత రెండో అతిపెద్ద కేంద్ర బ్యాంక్‌గా ఆర్బీఐ నిలిచింది.
కాగా నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్ నవంబర్ నెలలో 21 టన్నుల బంగారం కొనుగోలు చేసి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది మొత్తంగా 90 టన్నుల బంగారాన్ని అది కొనుగోలు చేయడంతో పాటుగా తన నిల్వలను 448 టన్నులకు పెంచుకుంది. అదే స మయంలో సింగపూర్ మానిటరింగ్ అథారిటీ తన బంగారం నిల్వలను నవంబర్ నెలలో 5 టన్నులు తగ్గించుకోవడం గమనార్హం.