calender_icon.png 29 September, 2024 | 7:03 AM

ఈ ఏడాది ఆర్బీఐ రేట్లు తగ్గించదు

19-09-2024 12:00:00 AM

ఎస్బీఐ చీఫ్ శ్రీనివాసులు శెట్టి అంచనా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఈ 2024 సంవత్సరంలో రిజర్వ్‌బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టి అంచనా వేశారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపునకు సిద్ధమవుతున్నప్పటికీ, మనదేశంలో ఆహార ద్రవ్యోల్బ ణంపై అనిశ్చితి ఉన్నందున, ఆర్బీఐ రేట్ల తగ్గింపునకు తొందరపడబోదంటూ ఎస్బీ ఐ కొత్త చైర్మన్ పీటీఐ వార్తా సంస్థతో ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయం వ్యక్తం చేశారు. నాలుగేండ్ల తర్వాత తొలి రేట్ల కోతను ఫెడ్ ప్రకటించనున్న నేపథ్యంలో శెట్టి ఈ వ్యాఖ్యలు చేశారు.

పలు కేంద్ర బ్యాంక్‌లు సైతం ఫెడ్ బాట పడతాయని అంచనా. ఫెడ్ నిర్ణయం అందర్నీ ప్రభావితం చేస్తుందని, అయితే ఆయా కేంద్ర బ్యాంక్‌లు ఆయా ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయని, ఆర్బీఐ మాత్రం ఆహార ద్రవ్యోల్బ ణాన్ని అనుసరించి వ్యవహరిస్తుందని శెట్టి వివరించారు. ‘అది మా దృష్టి కోణం. మా అభిప్రాయం ప్రకారం ప్రస్తుత క్యాలండర్ సంవత్సరంలో రేట్ల కోతకు ఉండకపోవచ్చు. ఆహార ద్రవ్యోల్బణం మెరుగుపడకపోతే వచ్చే ఏడాది తొలి త్రైమాసికం (2025 జనవరి వరకూ మనం వేచిచూడాలి’ అంటూ శ్రీనివాసులు శెట్టి వ్యాఖ్యానించారు. 

సబ్సిడరీల్లో వాటా అమ్మే యోచన లేదు

తమ సబ్సిడరీ కంపెనీల్లో ఎస్బీఐకి ఉన్న వాటాను ప్రస్తుతానికి విక్రయించే ఆలోచన లేదని శెట్టి వెల్లడించారు. ఈ సబ్సిడరీల వృద్ధికి మూలధనం అవసరమైతే తాము పరిశీలిస్తామని (వాటా విక్రయ ప్రతిపాదన) చెప్పారు. ఇప్పుడైతే తమ పెద్ద సబ్సిడరీలు వేటికీ మూలధనం అవసరం లేదని చెప్పారు. 2023-24 ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎస్బీఐ రూ.489 కోట్ల మూలధనాన్ని అందించింది.