calender_icon.png 16 January, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్బీఐ ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గించదు

07-09-2024 12:00:00 AM

ఎస్బీఐ క్యాప్స్ అంచనా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ఇతర గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్‌లతో పోలిస్తే రిజర్వ్‌బ్యాంక్ భిన్నంగా వ్యవహరిస్తుందని, పాలసీ వడ్డీ రేట్ల యథాతథ స్థితిని ఈ 2024 ఆర్థిక సంవత్సరం చివరివరకూ కొనసాగించవచ్చని ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ (ఎస్బీఐ క్యాప్స్) అంచనా వేసింది. అంతర్జాతీయ వృద్ధి మందగిస్తున్నప్పటికీ, భారత్ ఈ ఆర్థిక సంవత్సరం 7 శాతం జీడీపీ వృద్ధిని సాధిస్తుందని తాజా రిపోర్ట్‌లో పేర్కొంది. పలు కేంద్ర బ్యాంక్‌లు వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గుచూపుతున్నా, గత నెలలో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును స్థిరంగా 6.5 శాతం వద్ద అట్టిపెట్టిన సంగతి తెలిసిందే.

యూఎస్‌లో జాబ్‌లెస్ క్లెయింటు పెరగడం, హౌసింగ్ సేల్స్ క్షీణించడం తదితర అంశాలు ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ మందకొడితనాన్ని సూచిస్తున్నాయని, చైనా సైతం సవాళ్లను ఎదుర్కొంటున్నదని,డిమాండ్ లోపించడంతో ముడి చమురు ధరలు తగ్గుతున్నాయని ఎస్బీఐ క్యాప్స్ వివరించింది. ఇటువంటి అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం కారణంగా కేంద్ర బ్యాంక్‌లు వాటి పాలసీని సరళం చేయడానికి సిద్ధమవుతున్నాయని, యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ ఇప్పటికే సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు తెలిపారని పేర్కొంది.

యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లు కూడా ఇదే బాటను అనుసరిస్తాయని ఎస్బీఐ క్యాప్స్ తెలిపింది. కానీ భారత్ ఆర్థిక వృద్ధిపై పటిష్టమైన అంచనాలు, ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ మెరుగ్గా ఉండటం, పట్టణ వినియోగం, గ్రామీణ వినియోగం పెరగడం, మూల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం తదితర అంశాల కారణంగా వడ్డీ రేట్ల తగ్గింపునకు రిజర్వ్‌బ్యాంక్ తొందరపడబోదని ఎస్బీఐ క్యాప్స్ అభిప్రాయపడింది.