తనఖాలేని వ్యవసాయ రుణ పరిమితి రూ.2 లక్షలకు పెంపు
రిజర్వ్‌బ్యాంక్ రైతులకు తీపి కబురు అందించింది.బ్యాంక్‌లు తనఖా తీసుకోకుండా రైతులకు ఇచ్చే రుణం పరిమితిని పెంచింది. ద్రవ్యోల్బణం, వ్యవసాయ వ్యయాలు పెరుగుతున్నందున ఒక్కో రైతుకు తనఖా లేకుండా బ్యాంక్‌లు ఇచ్చే వ్యవసాయ రుణ పరిమితిని ప్రస్తుత రూ.1.6 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఇందుకు సంబంధించిన సర్క్యులర్‌ను త్వరలో జారీచేయనున్నట్లు చెప్పారు.
జీడీపీ వృద్ధి అంచనా 6.6 శాతానికి తగ్గింపు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్‌బ్యాంక్ గతంలో వెల్లడించిన జీడీపీ వృద్ధి రేటు అంచనాల్ని 7.2 శాతం నుంచి ప్రస్తుత సమీక్షలో 6.6 శాతానికి తగ్గించింది. పూర్తి ఏడాదికి అంచనాల్ని తగ్గించినా, పండుగ కొనుగోళ్లు, వ్యవసాయ దిగుబడి పెరగనున్నందున, రానున్న నెలల్లో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని భావిస్తున్నామని శక్తికాంత్ దాస్ తెలిపారు.
2024 సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాల్ని 4.5 శాతం నుంచి 4.8 శాతానికి పెంచినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లను ఇప్పుడే తగ్గించడం చాలా రిస్క్‌తో కూడుకున్నదని చెప్పారు.