calender_icon.png 16 January, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రారంభమైన ఆర్బీఐ రేట్ల కమిటీ సమావేశం

07-08-2024 12:40:46 AM

8న నిర్ణయం వెల్లడి

ముంబై, ఆగస్టు 6: కీలక వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెడుతుందన్న అంచనాల నేపథ్యంలో మంగళవారం రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) కమిటీ ద్వైమాసిక సమావేశం ప్రారంభమయ్యింది. మూడు రోజులపాటు సుదీర్ఘ చర్చల అనంతరం ఆగస్టు 8 గురువారం కమిటీ నిర్ణయాల్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడిస్తారు. ఎంపీసీలో దాస్‌తో పాటు ఆరుగురు సభ్యులు ఉంటారు. ద్రవ్యోల్బణం ఒత్తిడులు ఉన్నప్పటికీ, ఆర్థికాభివృద్ధి పుంజుకుంటున్నందున వడ్డీ రేట్ల కోతకు కమిటీ ప్రస్తుతం మొగ్గుచూపదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 6.5 శాతంగా ఉన్నది. 2023 ఫిబ్రవరిలో రెపోను 6.5 శాతానికి పెంచిన తర్వాత వరుసగా ఏడు పాలసీ సమీక్షలో ఎటువంటి మార్పు చేయలేదు. వాణిజ్య బ్యాంక్‌లకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తే బ్యాంక్‌లు రిటైలర్లకు, కార్పొరేట్లకు ఇచ్చే రుణాలపై రేట్లను తగ్గిస్తాయి. రెపో పెరిగితే అందుకు అనుగుణం గా బ్యాంక్‌లు సైతం రేట్లను పెంచుతాయి.

యూఎస్ ఫెడ్ వైపు చూపు

యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ పరిణామాల్ని ఆర్బీఐ కమిటీ సభ్యులు నిశితంగా చర్చించవచ్చని డీబీఎస్ బ్యాంక్ అనలిస్ట్ రాధికా రావు అన్నారు.   గతవారం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటులో మార్పు చేయనప్పటికీ, సెప్టెంబర్ నెలలో రేట్లకు కోతకు  సంకేతాల్ని వెల్లడించిన సంగతి తెలిసిందే.

ద్రవ్యోల్బణం దడ

ఆహారోత్పత్తుల ధరలు భారీగా పెరిగినందున జూన్ నెలలో రిటైల్ ద్రవ్యో ల్బణం నాలుగు నెలల గరిష్ఠస్థాయి 5.08 శాతానికి చేరింది. జూలై నెల రిటైల్ ద్రవ్యోల్బణం డేటా ఈ నెల రెండోవారంలో వెలువడుతుంది. రానున్న నెలల్లో అధిక వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు ఉన్నందున, రానున్న నెలల్లో ధరల తగ్గుదల ప్రభావాన్ని రేట్ల కమిటీ ప్రస్తుత సమావేశంలో చర్చించవచ్చని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ గతం లో ప్రకటించిన 4.5 శాతం ద్రవ్యోల్బణం అంచనాల్ని సవరించే అవకాశం ఉన్నదని ఎస్బీఐ రీసెర్చ్ నోట్ పేర్కొంది. ఆర్బీఐ పాలసీ రేటును 6.5 శాతం వద్దే అట్టిపెట్టవచ్చని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మాన్ శాక్స్ అంచనా వేసింది.

ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి అదుపుచేయాలన్న లక్ష్యాన్ని పునరుద్ఘాటించ వచ్చని గోల్డ్‌మాన్ శాక్స్ పేర్కొంది. ద్రవ్యోల్బణం ఇంకా 5.1 శాతం వద్ద గరిష్ఠస్థాయిలోనే ఉన్నందున, ఆర్బీఐ యథాతథ స్థితికే మొగ్గుచూపుతుందని తాము అంచనా వేస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవిస్ చెప్పారు. ఆర్థికాభివృద్ధి స్థిరంగా ఉన్నందున, ప్రస్తుత వడ్డీ రేట్లు వ్యాపారాలకు ప్రతికూలంగా పరిణమించబోవని, అందుచేత ద్రవ్యోల్బణం దిగువబాట పట్టేవరకూ ఆర్బీఐ వేచిచూస్తుందని అంచనా వేస్తున్నామన్నారు.