ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకటన
ముంబై: అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అధిక ద్రవ్యోల్బణం, బలహీనమైన జిడిపి వృద్ధి సంఖ్యల మధ్య మూడు రోజుల ద్రవ్య విధాన ప్యానెల్ సమావేశం ముగిసిన తర్వాత ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాన్ని వెల్లడించారు. రెపో రేటును 6.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. 2023 ఫిబ్రవరి నుంనచి కేంద్ర బ్యాంకు ఈ రేటును కొనసాగిస్తూ వస్తుంది. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11సారి. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 6.25 శాతంగా ఉంచింది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంకు రేటును 6.75 శాతంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం, ఇతర అంశాల ఆధారంగా ఈ సారి కూడా వడ్డీ రేట్లలో మార్చులు చేయొద్దని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
ఈ నెలాఖరుతో ముగియనున్న గవర్నర్ శక్తికాంత దాస్ పాలకమండలి అధ్యక్షుడిగా కొనసాగుతారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన మరుసటి రోజు డిసెంబర్ 2018లో ఆయన గవర్నర్‌గా నియమితులయ్యారు. 2021లో అతనికి పొడిగింపు లభించింది. ఆర్బీఐ ఎంపీసీ వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి అంచనాలు, ప్రపంచ చమురు ధరల ప్రభావంతో సహా పలు కీలకమైన అంశాలను చర్చిస్తుందని భావిస్తున్నారు. భారతదేశ ఆర్థిక ఆరోగ్యం నేపథ్యంలో ఈ అంశాలను జాగ్రత్తగా అంచనా వేసిన తర్వాత రెపో రేటుపై నిర్ణయం తీసుకోబడుతుంది. మిశ్రమ ఆర్థిక ధోరణులను పరిష్కరించడానికి ఆర్‌బిఐ నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్)ను సర్దుబాటు చేసే సమయంలో ప్రస్తుత రెపో రేటును కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.