calender_icon.png 25 September, 2024 | 5:52 AM

అక్టోబర్ నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతలు

25-09-2024 12:00:00 AM

ఎస్ అండ్ పీ అంచనా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22:  వచ్చే అక్టోబర్ పాలసీ సమీక్ష నుంచి రిజర్వ్‌బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. అటుతర్వాత ఈ ఆర్థిక సంవత్సరంలోనే రెండు దఫాలు రేట్లను తగ్గించవచ్చని మంగళవారం విడుదల చేసిన ఆసియా పసిఫిక్ ఎకనామిక్ అవుట్‌లుక్‌లో ఎస్ అండ్ పీ అంచనాల్లో పేర్కొంది.

రేట్ల కోతకు ఆహార ద్రవ్యోల్బణం అడ్డంకిగా పరిగణిస్తున్నదని, ఆహార ధరలు పెరిగినట్లయితే మూల ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కొనసాగించడం కష్టమని భావిస్తున్నదని రేటింగ్ ఏజెన్సీ వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ సగటు ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉండవచ్చని పేర్కొంది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అక్టోబర్ 7 తేదీల్లో జరుగుతుంది.

2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా అట్టిపెడుతున్నది. అయితే యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ గత వారం అంచనాల్ని మించి 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో వచ్చే నెల సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. 

ఆర్థికాభివృద్ధి 6.8 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ 6.8 శాతం వృద్ధి సాధిస్తుందని ఎస్ అండ్ పీ రేటింగ్స్ తాజా అంచనాల్లో పేర్కొంది. వచ్చే 2025 ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతం వృద్ధిని కనపరుస్తుందని, ఇటువంటి పటిష్ఠ వృద్ధి నేపథ్యంలో  ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్ష్యానికి తగ్గించడంపై ఆర్బీఐ  దృష్టి నిలుపుతుందని రేటింగ్ ఏజెన్సీ వివరించింది.

అధిక వడ్డీ రేట్ల ఫలితంగా పట్టణ వినియోగ డిమాండ్ తగ్గడంతో ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి కాస్త తగ్గిందని, అయితే పూర్తి ఆర్థిక సంవత్సరంలో తమ అంచనాలకు అనుగుణంగా జీడీపీ 6.8 శాతం వృద్ధిచెందుతుందని ఎస్ అండ్ పీ అంచనా వేసింది.