calender_icon.png 17 October, 2024 | 2:26 AM

డిసెంబర్ నుంచి ఆర్బీఐ వడ్డీరేట్ల కోతలు

28-09-2024 12:00:00 AM

యూబీఎస్ అంచనా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: రిజర్వ్‌బ్యాంక్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ యూబీఎస్ తాజా అంచనాల్లో పేర్కొంది. అంతర్జాతీయంగా కేంద్ర బ్యాంక్‌లు వాటి ద్రవ్య విధానాల్ని సరళం చేస్తున్నందున, దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలు ఉన్నందున ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)  2024 డిసెంబర్ నుంచి వడ్డీ రేట్లను దించుతుందని యూబీఎస్ రిపోర్ట్‌లో వివరించింది.

2024-25 సంవత్సరానికి ఆర్బీఐ ప్రకటించిన 4.5 శాతం అంచనాకంటే ద్రవ్యోల్బణం 30 బేసిస్ పాయింట్లు (0.30 శాతం) తక్కువగా ఉంటుందని, అందుచేత రేట్ల తగ్గింపు సైకిల్‌ను డిసెంబర్‌లో ప్రారంభించి, ఈ సైకిల్‌లో 75 బేసిస్ పాయింట్ల వరకూ (0.75 శాతం) రెపో రేటులో కోతపెడుతుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అంచనా వేసింది.

గతవారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఒకేదఫాలో 50 బేసిస్ పాయింట్ల మేర (0.50 శాతం) కీలక వడ్డీ రేటును తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ వ్యాఖ్యానిస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఫెడ్ వ్యవహరించిందని, భారత ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

అక్టోబర్ 7-9 తేదీల మధ్య జరిగే వచ్చే ద్రవ్య విధాన పరపతి సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలో ఎంపీసీ వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని వెల్లడించనుంది. అటుతర్వాత సమీక్ష డిసెంబర్ 4-6 తేదీల మధ్య జరుగుతుంది. వరుసగా 9 సమీక్షల నుంచి రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఆర్బీఐ అట్టిపెడుతున్నది. 

ఆహార ద్రవ్యోల్బణం ఆధారంగానే నిర్ణయం

వడ్డీ రేట్లపై ఎంపీసీ నిర్ణయాలను ప్రభావితం చేసే రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టు నెలలో 3.65 శాతంగా నమోదయ్యింది. జూలైలో కూడా 3.54 శాతం కనిష్ఠస్థాయి వద్దే ద్రవ్యోల్బణం నిలిచి ఉన్నది. ఆర్బీఐ నిర్దేశిత లక్ష్యం 4 శాతం లోపున ఇది కొనసాగుతూ ఉన్నా, ఆహార ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నదన్న ఆందోళనను రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ వ్యక్తం చేస్తున్నారు.

ఆగస్టు నెలలో 5.66 శాతం ఆహార ద్రవ్యోల్బణం నమోదయ్యింది. అయితే నెలవారీ గణాంకాల ఆధారంగా కాకుండా, దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం బాటపై అంచనాలకు అనుగుణంగా వడ్డీ రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామని శక్తికాంత్ దాస్ ఇటీవల వెల్లడించారు.