calender_icon.png 25 January, 2025 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్బీఐ తొమ్మిదో సారీ

09-08-2024 02:18:02 AM

  1. 6.5 శాతం వద్దే కీలక వడ్డీ రేటు 
  2. జీడీపీ వృద్ధి అంచనా 7.2 శాతం 
  3. ద్రవ్యోల్బణం అంచనా 4.5 శాతం

ముంబై, ఆగస్టు 8:  గృహ రుణాలు, ఆటో రుణాల ఈఎంఐలు తగ్గుతాయని ఆశిస్తున్న రుణగ్రహీతలను  రిజర్వ్‌బ్యాంక్ వరుసగా తొమ్మిదోసారీ నిరుత్సాహపర్చింది.  కీలక వడ్డీ రేటు (రెపో రేటును) యథాతథంగా 6.5 శాతం వద్దే అట్టిపెట్టింది.  రిజర్వ్‌బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) కమిటీ మూడురోజుల  ద్వైమాసిక సమావేశం అనంతరం గవర్నర్ శక్తికాంత్ దాస్ తమ సమీక్ష నిర్ణయాల్ని వెల్లడించారు. ఎంపీసీలో దాస్‌తో పాటు ఆరుగురు సభ్యులు ఉంటారు.

2023 ఫిబ్రవరిలో రెపోను 6.5 శాతానికి పెంచిన తర్వాత వరుసగా ఎనిమిది పాలసీ సమీక్షల్లో ఎటువంటి మార్పు చేయలేదు. వాణిజ్య బ్యాంక్‌లకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తే బ్యాంక్‌లు రిటైలర్లకు, కార్పొరేట్లకు ఇచ్చే రుణాలపై రేట్లను తగ్గిస్తాయి. రెపో పెరిగితే అందుకు అనుగుణంగా బ్యాంక్‌లు సైతం రేట్లను పెంచుతాయి. రెపో రేటును యథాతథంగా అట్టిపెట్టడంతో పాటు ఆర్బీఐ పాలసీ కఠిన వైఖరిలో సైతం మార్పు చేయలేదు. ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు యథాతథ స్థితికి ఓటు చేయగా, ఇద్దరు రేట్ల కోతకు మొగ్గుచూపారు. 

ద్రవ్యోల్బణం 4 శాతానికి తగ్గించాలన్నది లక్ష్యం 

పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణంపై కమిటీ దృష్టిపెట్టిందని, 4 శాతం లక్ష్యానికి దించేందుకు కట్టుబడి ఉన్నట్టు దాస్ తెలిపారు. ఈ ఏడాది జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్ఠస్థాయి 5.08 శాతం వద్దకు పెరిగింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ధరల్లో స్థిరత్వం లేకుండా అధిక వృద్ధి నిలబడదని దాస్ చెప్పారు. తమ ద్రవ్య విధానం ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ఉంటుందన్నారు. ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.2 శాతం వృద్ధిచెందవచ్చని రిజర్వ్‌బ్యాంక్ అంచనా వేసింది. 

డిపాజిట్ల వృద్ధి తగ్గుదలపై ఆందోళన

బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ల వృద్ధి తగ్గుదల పట్ల శక్తికాంత్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. రిటైల్ ఖాతాదారులకు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలు ఆకర్షణీయంగా ఉన్నందునే బ్యాంక్‌ల్లో డిపాజిట్ వృద్ధి మందగిస్తున్నదని చెప్పారు. ఆ ప్రత్యమ్నాయ మదుపు మార్గాలేమిటో గవర్నర్ వెల్లడించలేదు. స్టాక్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని ఆ వ్యాఖ్యలు చేశారు. డిపాజిట్లు తగ్గుతున్నందున, రుణాల డిమాండ్‌ను తీర్చడానికి బ్యాంక్‌లు స్వల్పకాలిక నాన్ డిపాజిట్లు, ఇతర సాధనాలపై ఆధారపడుతున్నాయని దాస్ చెప్పారు. వినూత్న సాధనాలు, సర్వీసుల ద్వారా కుటుంబ పొదుపును ఆకర్షించాలని బ్యాంక్‌లకు సూచించారు. 

డిసెంబర్‌లో రేట్ల కోతకు అవకాశం

రిజర్వ్‌బ్యాంక్ ఈ ఏడాది డిసెంబర్‌లో వడ్డీ రేట్ల కోతకు శ్రీకారం చుడుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. సానుకూల ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితుల ఆధారంగా అక్టోబర్‌లో పాలసీ వైఖరిని మార్చుకుంటుందని, డిసెంబర్ నుంచి రేట్ల కోతను ప్రారంభించవచ్చని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ అంచనా వేశారు. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, దేశీయ ప్రాధాన్యతలకు అనుగు ణంగా పాలసీ గైడెన్స్‌లో ఆర్బీఐ ఎటువంటి మార్పులు చేయలేదని డీబీఎస్ బ్యాంక్ సీనియర్ ఎకానమిస్ట్ రాధికారావు చెప్పారు. అధిక ద్రవ్యోల్బణంపై దృష్టి నిలుపుతూ ఈ ఏడాది ఆర్బీఐ రేట్లను తగ్గించకపోవచ్చని రాధికారావు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కొత్త రికార్డుస్థాయికి విదేశీ మారక నిల్వలు

దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు కొత్త రికార్డుస్థాయికి చేరాయి. ఆగస్టు 2తో ముగిసినవారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు 675 బిలియన్ డాలర్ల చరిత్రాత్మక గరిష్ఠస్థాయికి పెరిగాయని శక్తికాంత్‌దాస్ చెప్పారు. మొత్తంమీద భారత్ విదేశీ చెల్లింపుల పరిస్థితి స్థిరంగా ఉన్నదని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో 4.2 బిలియన్ డాలర్లు వెనక్కుతీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు జూన్ నుంచి ఆగస్టు 6 వరకూ 9.7 బిలియన్ డాలర్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చేశారని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. 

పాలసీ ప్రధానాంశాలు

  1. వరుసగా తొమ్మిదోసారి 6.5 శాతం వద్దే కీలక వడ్డీ రేటు (రెపో)
  2. ద్రవ్యోల్బణం అదుపు, వృద్ధికి మద్దతుగా సరళ పాలసీ వైఖరి ఉపసంహరణపై దృష్టి
  3. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.2 శాతం
  4. ప్రస్తుత 2024 సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం అంచనా 4.5 శాతం
  5. అంతర్జాతీయ వృద్ధి వేగం తగ్గినప్పటికీ, స్థిరంగా ఉంటుందన్న అంచనా
  6. దేశీయ కరెంటు ఖాతా లోటు అదుపులోనే.. విదేశీ మారక నిల్వలు చరిత్రాత్మక గరిష్ఠస్థాయి 675 బిలియన్ డాలర్లకు చేరిక
  7. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ రూపాయి విలువ హెచ్చుతగ్గుల శ్రేణి పరిమితం
  8. బలపడుతున్న దేశీయ ఫైనాన్షియల్ వ్యవస్థ 
  9. అనధికార వ్యక్తులు, సంస్థల్ని నిరోధించేదిశగా డిజిటల్ లెండింగ్ యాప్స్ పబ్లిక్ రిపాజిటరీ ఏర్పాటు
  10. కుటుంబసభ్యుల్లో మరొకరికి యూపీఐ లావాదేవీలు నిర్వహించే వెసులుబాటు కల్గించే యూపీఐ డెలిగేటెడ్ పేమెంట్స్ వ్యవస్థకు గ్రీన్‌సిగ్నెల్
  11. యూపీఐ ద్వారా పన్నుల చెల్లింపు పరిమితి రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు
  12. చెక్కుల క్లియరెన్స్ వేగవంతం
  13. ఆర్బీఐ ఎంపీసీ తదుపరి సమావేశం అక్టోబర్ 7 నుంచి 8 వరకూ