* ఎస్బీఐ రీసెర్చ్ అంచనా
న్యూఢిల్లీ, డిసెంబర్ 10 : ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియామకంతో రిజర్వ్‌బ్యాంక్ తదుపరి ఫిబ్రవరిలో వడ్డీ రేట్ల తగ్గింపునకు మార్గం సుగమమైందని ఎస్బీఐ రీసెర్చ్ మంగళవారం విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది. డిసెంబర్ 6నాటి పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లపై శక్తికాంత్ దాస్ తన యథాతథ స్థితి విధానానికి కట్టుబడి ఉన్నారని ఎస్బీఐ రీసెర్చ్ అనలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
బ్యూరోక్రాట్ అయిన మల్హోత్రా నేతృత్వంలో ద్రవ్య విధానం సరళంగా ఉం టుందని, ఫిబ్రవరి పాలసీలో రేట్ల కోతకు అవకాశం ఉన్నదని జపాన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ నోమురా అంచనా వేసింది. జీడీ పీ వృద్ధికి వచ్చే సమావేశంలో రేట్ల కొత తప్పనిసరి కానుందని పేర్కొంది. గత కొద్దివారాలుగా ద్రవ్య విధానంపై ప్రభుత్వం, ఆర్బీఐల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడినట్లు కన్పిస్తున్నదని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్‌లు ఆర్బీఐ పాలసీని కఠినంగా ఉంచడాన్ని విమర్శించడమే ఇందుకు నిదర్శనమని నోమురా వివరించింది.
ప్రభుత్వం పాత్ర పెరుగుతుంది
మల్హోత్రా ఆర్థిక అభిప్రాయాలు ఏమిటన్నది తమకు తక్కువగా తెలుసని దేశీ య బ్రోకరేజ్ ఎమ్కే సెక్యూరిటీస్ పేర్కొం ది. గతంలో మల్హోత్రా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఉన్నపుడు తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేవారని వివిధ బ్యాంకర్లతో తాము చర్చించిన సందర్భం గా వెల్లడయ్యిందని ఎమ్కే వివరించింది. కొత్త గవర్నర్ ఆర్థిక శాఖ నుంచి వచ్చినందున, మానిటరీ పాలసీ నిర్ణయాల్లో ప్రభుత్వం పాత్ర పెరుగుతుందని భావిస్తున్నట్లు స్విస్ బ్రోకరేజ్ యూబీఎస్ తెలి పింది.
శక్తికాంత్ దాస్ ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని కొనసాగించడంతోపాటు కోవిడ్ పాండమిక్ షాక్ నుంచి ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పారని, ఆర్థిక సేవల విస్తరణ, డిజిటలైజేషన్‌పై దృష్టి పెట్టారని యూబీఎస్ పొగడ్తల వర్షం కురిపించింది. మల్హోత్రా వృద్ధి రిస్క్‌ను, ద్రవ్యోల్బణం పెరుగుదలను మల్హోత్రా నియామకం ఫైనాన్షియ ల్ మార్కెట్లను ఆశ్చర్యపర్చిందని, ఆయన సమతౌల్యం చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. తగ్గుతున్న జీడీపీ వృద్ధి, అధిక పాలసీ రేటు కారణంగా 2025 ఫిబ్రవరి నుంచి వచ్చే ఏడాది ఆర్బీఐ రెపో రేటును 0.75 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని యూబీఎస్ అంచనా వేసింది.