- కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
- ఒడిశాలో దుమారం
భువనేశ్వర్, సెప్టెంబర్ 2: ఒడిశాలోనే పురాతనమైన రావెన్ యూనివర్సిటీ పేరు మార్చాల్సిన అవసరం ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ అభిప్రాయ పడ్డారు. కటక్‌లోని వర్సిటీలో తాజాగా నిర్వహించిన స్థానిక స్వపరిపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. 1866 లో దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఉన్నాయని, నాడు రావెన్‌షా ఒడిశాలో బ్రిటిష్ కమిషనర్‌గా ఉన్నారని గుర్తుచేశారు. కరువు కోరల్లో చిక్కుకుని ఎంతోమంది ప్రజ లు మృత్యువాత పడ్డారని, రావెన్ ప్రజల కోసం ఏం చేయలేకపోయారని ఆరోపించారు. కేవలం వర్సిటీని స్థాపించినంత మాత్రాన, ఆయన పేరే పెట్టడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
ఒడిశాకు చెందిన మేధోవర్గం ఈ అంశంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి వ్యాఖ్యలపై ఒడిశాలో పెద్ద దుమారమే చెలరేగింది. వర్సిటీ పూర్వ విద్యార్థి హేమేంద్ర నారాయణ్‌దాస్ మాట్లాడుతూ.. మంత్రి వాదన అసంబద్ధమని, పేరు మార్చేందుకు వీలు లేదన్నారు. మరో పూర్వ విద్యార్థి, అడ్మినిస్ట్రేటర్ సత్యకామ్ మిశ్రా మాట్లాడుతూ.. రావెన్ షా కృషితోనే విద్యార్థులు ఒడియా చదువుకోగలిగారని, రావెన్ షా పేరు మార్చాడాన్ని మేం వ్యతిరేకిస్తున్నామని తేల్చిచెప్పారు.