calender_icon.png 25 October, 2024 | 8:56 AM

రవీనా కూతురు.. బాలకృష్ణ కొడుకుతో

25-10-2024 12:00:00 AM

ప్రముఖ టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ కథానాయకుడిగా తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రాన్ని ‘హను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. మోక్షజ్ఞ కోసం ప్రశాంత్‌వర్మ పవర్‌ఫుల్ యాక్షన్, కుటుంబ భావోద్వేగాలతో కూడిన కథను సిద్ధం చేసిన ట్టు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి అన్నీ సిద్ధమైన ప్పటికీ మోక్షజ్ఞ సరసన నటించే కథానాయిక ఎవరనే విషయంలో రోజుకో వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా వినవస్తున్న విషయమేమిటంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడాని నటించనుందని చర్చ సాగుతోంది.

ఇప్పటికే రషా ఆడిషన్స్ కూడా ఇచ్చిందని, త్వరలోనే మూవీ యూనిట్‌తో షూటింగ్‌లో పాల్గొనబోతోందని చెప్పుకొంటున్నారు. గతంలో మోక్షజ్ఞకు జోడీగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీలను మేకర్స్ ఎంపిక చేసే అవకాశం ఉందంటూ గతంలోనూ వార్తలు బలంగానే వినిపించాయి. మొత్తానికి మోక్షజ్ఞతో ఆడిపాడేందుకు ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం  తెలియాలంటే.. చిత్రబృందం అధికారిక ప్రకటన చేసే దాకా ఆగాల్సిందే!