calender_icon.png 13 January, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రావమ్మ సిరినోము జేయ మా దరిజేరవమ్మ

26-12-2024 12:00:00 AM

పదో రోజున జ్ఞానవతి అయిన గోపికను నిద్ర లేపిన ఆండాళ్ 11వ రోజున సౌందర్యవతి అయిన మరో భక్తురాలైన గోప బాలికను తోడ్కొని పోవడానికి ఆమె వాకిట నిలిచి ఆహ్వానిస్తున్నారు. పురుషులను ఆకర్శించేది దేహ సౌందర్యం అయితే, పురుషోత్తముణ్ణి ఆకర్షించేది భక్తి సౌందర్యం. గోపికలు ఒక కంటి రెప్పపాటు కూడా గోవిందుని ఎడబాటును సహించేవారు కాదట. పరమభక్తులు తమనొక నాయికగా, భగవంతుడిని నాయకుడిగా భావిస్తారు. భగవంతునిపై వారికుండే భక్తి జ్ఞానాలే వారి సౌందర్య ప్రకాశాలు. 

కత్తుకఱవై= దూడల వంటి పశువులు, పలకణంగళ్= అనేక మందలను, కఱందు= పాలు పితుకుతున్న వారు, సెట్రార్= శత్రువుల, తిఱల్ అఝియ= బలం నశించే విధంగా, చెన్ఱు= దండెత్తి, శెరుశెయ్యుమ్= యుద్ధం చేసేవారును, కుట్రమ్ ఒన్రు ఇల్లాద= కొరత ఏదీ లేని వారైన, కోవలర్ తమ్= గోపవంశంలో జన్మించిన, పొర్ కొడియే= బంగారు తీగ వలె నున్నదానా, పుట్రు అరవు అల్‌గుల్= పుట్టలోని పాము పడగవంటి నితంబము గలదానా, పునమయిలే= తోటలోని నెమలివలె ఉన్నదానా, పోదరాయ్= బయలుదేరి రావమ్మా, శుట్రత్తు= చుట్టములు, తోఝిమార్= చెలికత్తెలు, ఎల్లారుమ్= ఎల్లరును, వందు= వచ్చి, నిన్ ముట్రమ్ పుగుందు= నీ భవనంలోకి ప్రవేశించి, ముగిల్ వణ్ణన్= మొగిలి వర్ణం కలిగిన (మేఘపు మేని రంగువాడు) శ్రీకృష్ణుడు, పేర్= పేరు, పాడ= పాడుటకు, శెల్వ= అందమైన, పెండాట్టి నీ= సతీమణీ, శిట్రాదే పేశాదే= ఉలకకుండా పలకకుండా, ఎత్తుక్కు= ఎందుకు, ఏ ప్రయోజనాన్ని ఆశించి, ఉరంగుమ్= నిద్రిస్తున్నావు, పోరుళ్= దీనికి కారణమేమిటి?

ఎంత అందమైన భావన? కొమ్ములతో కుమ్ముతాయని భయ పడకుండా పాలు పిదికేవారు రణంలో బాణాలు లెక్క చేయక అరివీరుల ప్రాణాలు తీసేందుకు వెనుకాడని వీరులు యాదవులనే హరివంశంలో వీరపుత్రికకు మేలుకొలుపుల గీతికలు. ‘ఓ సౌందర్యరాశీ! నెమలి పింఛాల నెలతా, పడగ నితంబపు పడతీ అందాల భరణీ ఎంతసేపీ నిద్ర నీకు’. ‘నీవు కృష్ణప్రియవని, నీవు తోడైతే నెమలి పింఛమువాడు మమ్ము కాచేనని నీకై వేచి వేచి, మా కనులు కాచినా కదలవేమిది కమలాక్షీ’ ‘మొద్దు నిద్దుర వదిలి ముద్దుగుమ్మా లేవవమ్మా.

మోహన రూపుని జగదేక సుందరు కృష్ణమూర్తిని ఆడిపాడి కొనియాడుదాం దావమ్మా’ ‘తొలి కిరణాల వెచ్చని వెలుగుల యమునలో మునకతో లోకులందరికీ దారి చూపిన గోపికా కన్నెల గొప్ప నోముకు కదలవే రేపల్లె పిల్లా లేచి రావే తల్లీ’ అని గోద పాడిన మధుర గీతం ఈ పాశురం. దూడలుగల ఆవులు, దూడలకు పాలిచ్చే, దూడలవలె ఉండే, తక్కువ వయసుగా కనపడే, గుంపులు గుంపులుగా ఉన్న ఆవుల, పాలు పితకటంలో నేర్పరులు,  శత్రువుల బలం నశించేట్టుగా, వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ మదమును అణచగలిగేవారు,  ఏ పాపమూ అంటని వారు, ఎందుకంటే వీరు ఏమి చేసినా శ్రీకృష్ణుడి కోసమే కదా చేసేది, శ్రీకృష్ణుడి శత్రువులే వారి శత్రువులు, అవి బాగా పెరిగిన పశువులు కావు, దూడలు.

అవి అనేక మందలుగా ఉన్నాయి. ఆ పశువుల పాలూ పితకగలరు, అదే చేత్తో శత్రువులపై దండెత్తిన వారిని నాశనమూ చేయగలరు, వారు యాదవులు. ఏ దోషమూ లేనివారు, ఆ కులంలో పుట్టిన గోపాల బాలికవు నీవు. భగవద్దర్శనంతో గోపికలూ, స్పర్శనంతో గోవులూ పులకిస్తున్నా గోలోకం బృందావనం. అవి దూడలే అయినా శ్రీకష్ణుని కరస్పర్శతో అవి పొదుగుల నుంచి పాలధారలను కార్చగల పశువులవుతున్నాయి.