calender_icon.png 27 September, 2024 | 4:57 PM

రావమ్మా.. బతుకమ్మా!

27-09-2024 12:00:00 AM

  1. మొదలైన బొడ్డెమ్మ సంబురాలు 
  2. అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం

వర్షఋతువు వెళ్లి శరధృతువులోకి ప్రవేశించి వెన్నెల కాచే వేళ, ఆశ్వీయుజ మాసం వస్తుందంటే తెలంగాణ వ్యాప్తంగా మహా పండుగల వాతావరణం నెలకొంటుంది. ‘వినాయక చవితి’ నిమజ్జనం తెల్లవారే వచ్చే భాద్రపద పూర్ణిమ నుంచి ఒకవైపు పితృదేవతల ఆరాధనతో ‘మహాలయ పక్షం’ మొదలైతే, మరోవైపు ఇదే సమయంలో మహిళలు ‘బొడ్డెమ్మ’ పండగకు శ్రీకారం చుడతారు. 

ఈ పున్నమిని ‘బొడ్డెమ్మ పున్నమి’గానే వ్యవహరిస్తారు. ఈ పౌర్ణమి నుంచి ‘మహాలయ అమావాస్య’ వరకు 15 రోజులు పూర్వకాలంలో బొడ్డెమ్మ సంబురాలు అత్యంత అట్టహాసంగా జరిగేవి. తర్వాత తొమ్మిది రోజులకు కుదించారు. అయితే, ఈ సమయంలోనే పితృపక్షాలు కూడా వస్తుండడం వల్ల కాలక్రమంలో పూర్ణిమ నుంచి బొడ్డెమ్మను జరుపుకోవడం బాగా తగ్గిపోయింది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుపుకుంటున్నారు. వినాయక చవితి మరుసటి రోజు వచ్చే బహుళ పంచమి నుంచి 9 రోజులు జరుపుకొనే వారు కొందరైతే, మరి కొందరు దశమి, ద్వాదశి నుంచి 5 రోజులు జరుపుకుంటారు. ఇంకా కొందరైతే, త్రయోదశి నుంచి అమావాస్య వరకు 3 రోజులకే బొడ్డెమ్మ పండుగను పరిమితం చేశారు. ‘బొడ్డెమ్మ’ అంటేనే పెండ్లికాని ఆడబిడ్డలు ఆనందోత్సాహాలతో జరుపుకొనే వేడుక. మంచి భర్తను ప్రసాదించమని వేడుకొంటూ బొడ్డెమ్మ రూపంలో అమ్మవారిని వారు ఆరాధిస్తారు.

అయిదు రకాల బొడ్డెమ్మలు

బొడ్డెమ్మలను పేడతోకాని, మట్టితోకాని లేదా వివిధ పూలతోకాని చేస్తారు. తయారుచేసే విధానాన్నిబట్టి పీట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మగా (అయిదు రకాలుగా) చేసి పూజించడం ఆనవాయితీగా ఉంది. మట్టితో చేసే బొడ్డెమ్మలకు మంచి పుట్టమన్ను ఉపయోగిస్తారు.

ఆవుపేడతో బొడ్డెమ్మను చేయడం శ్రేష్ఠంగానూ చెప్తారు. కన్నెపిల్లలకు తొమ్మిది రోజుల ‘బొడ్డెమ్మ పండుగ’ ఎలాగో ముత్తయిదువలైన మహిళలకు తొమ్మిది రోజుల ‘బతుకమ్మ సంబురాలు’ అలాగే! బొడ్డెమ్మ లేదా బతుకమ్మను ఇంటిముందు కాని, లేదా నలుగురు కూడే చోటకాని అలికి ముగ్గు వేసి, పీటలు వుంచి వాటిపై ఉంచుతారు. ఆడపిల్లలు, మహిళలు పట్టువస్త్రాలు, ఆభరణాలతో చక్కగా ముస్తాబై వాటి చుట్టూ గుండ్రంగా తిరుగుతూ ఆడుతూ, కలిసికట్టుగా పాటలు పాడుతారు. ఇది రోజులు, గంటల తరబడి సాగినా అలసటకు లోనుకాని పవిత్ర భావోద్వేగం మన మహిళామూర్తులది. ఆటలయ్యాక, బతుకమ్మ వలె బొడ్డెమ్మలనూ ప్రతి రోజూ చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. 

తెలంగాణ అస్తిత్వానికి నిదర్శనమైన బొడ్డెమ్మ, బతుకమ్మల పండుగలు సుమారు వెయ్యేళ్లనుంచీ వాడుకలో వున్నట్టు వివిధ చారిత్రిక ఆధారాలనుబట్టి తెలుస్తున్నది. తెలంగాణ జానపద సంస్కృతి, సంప్రదాయాలకు ఒక నిలువెత్తు ప్రతీక బతుకమ్మ. ప్రతి ఏడాది భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వీయుజ శుక్ల అష్టమి (దుర్గాష్టమి) వరకు 9 రోజులు ‘బతుకమ్మ’ పండుగను ఆడమగ, పిల్లపెద్ద అందరూ కలిసి మహదానందంగా జరుపుకుంటారు. అటు బొడ్డెమ్మ అయినా, ఇటు బతుకమ్మ అయినా, పూల వేడుకగానే చెప్పాలి. 

‘బతుకమ్మ’కు వెయ్యేళ్ల చరిత్ర

బతుకమ్మ పండగ ప్రారంభంతో ముడిపడి ఉన్న అనేక కథనాలు జనావళిలో ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి చెందిన ధర్మాంగదుడు అనే రాజు మన దేశంలో దక్షిణాదిని, తెలంగాణ ప్రాంతాన్ని పాలించేవాడు. ఆయన హయాంలో ఈ పండగ ప్రారంభమైందని ప్రజల పాటలనుబట్టి తెలుస్తున్నది. ఈ రాజ దంపతులకు అనేక పూజలు, నోముల తర్వాత ఒక ఆడబిడ్డ జన్మిస్తుంది. ఆ బిడ్డకు ‘లక్ష్మి’ అని పేరు పెడ్తారు. పెరిగే వేళల్లో అనేక ప్రమాదాల బారినుంచి ఆ పాప బయటపడింది. ఇలా వరుస ప్రమాదాలు ఎదురవుతుండటంతో రాజ దంపతులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే పండితుల సూచన మేరకు ఆమెకు ‘బతుకమ్మ’ అనే పేరు పెడ్తారు. అప్పటి నుంచి బతుకమ్మ పేరిట ఉత్సవాలు జరుగుతున్నట్టు ప్రజలు చెప్తారు. మరో కథనం ప్రకారం, వేములవాడలో బతుకమ్మ ఆటలు మొదలైనాయనీ చెప్తారు. 

తొమ్మిది రోజుల సంబురాలు

’బతుకమ్మ’ పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ. బతుకమ్మకు ప్రతి రోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువతీ యువకులు పాల్గొంటారు.  మొదటిరోజు: ఎంగిలి పూల బతుకమ్మ. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం చేస్తారు. రెండవ రోజు: అటుకుల బతుకమ్మ. సప్పిడి పప్పు, బెల్లం, అటుకుల నైవేద్యం. మూడవ రోజు: ముద్ద పప్పు బతుకమ్మ. ముద్దపప్పు, పాలు, బెల్లంతో సమర్పిస్తారు. నాలుగవ రోజు: నానే బియ్యం బతుకమ్మ. నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

అయిదవ రోజు: అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశలను నైవేద్యంగా పెడతారు. ఆరవ రోజు: అలిగిన బతుకమ్మ. ఈరోజు నైవేద్యమేమి సమర్పించరు. ఏడవ రోజు: వేపకాయల బతుకమ్మ. బియ్యం పిండిని బాగా వేయించి వేపపండ్లుగా చేసి సమర్పిస్తారు. ఎనిమిద రోజు: వెన్నముద్దల బతుకమ్మ నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు. తొమ్మిదవ రోజు: సద్దుల బతుకమ్మ. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగించడం కద్దు. ప్రతీ రోజూ బతుకమ్మలు చేసి, సాయంత్రం వాటి చుట్టూ తిరుగుతూ, ఆడుతూ పాడుతూ నిమజ్జనం చేస్తారు.