హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (విజయక్రాంతి): మనీలాండరింగ్ కేసు నమోదైందని ఓ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరింపులకు గురి చేసి అతడి ఖాతాలో ఉన్న రూ.48 లక్షలను దోచుకున్నారు సైబర్ నేరగాళ్లు. నగరానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి(55)కి ఢిల్లీ సీబీఐ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. బాధితుడు మనీలాండరింగ్, చట్టవిరుద్ధ్దమైన కార్యకలాపాలలో పాల్గొన్నాడని పేర్కొన్నారు.
మీ సంబంధింత వివరాలతో ఢిల్లీలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో అక్రమ బ్యాంక్ ఖాతాను తెరిచారని, రూ. 20 కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకు అక్రమ లావాదేవీలు జరిపారని తెలిపాడు. దీనిపై మనీలాండరింగ్ కేసు నమోదైన నేపథ్యంలో మీపై నాన్‌బెయిల్ వారెంట్ జారీ అయ్యిందని పేర్కొన్నారు. ఇలా సుమారు 7 గంటల పాటు బాధితుడితో మాట్లాడిన స్కామర్లు..
తాము సూచించిన ఖాతాకు నగదు బదిలీ చేయాలని, 24 గంటల్లో తిరిగి చెల్లిస్తామని వాగ్ధానం చేశారు. ఇదంతా నిజమేనని నమ్మిన బాధితుడు తన ఖాతాలో ఉన్న రూ.48లక్షలను ఆర్టీజీఎస్ ద్వారా సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాకు బదిలీ చేశారు. అనంతరం అవతలి వ్యక్తుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు గురువారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.