calender_icon.png 3 February, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డేపల్లి కేంద్రంగా రేషన్ బియ్యం దందా

02-02-2025 08:23:20 PM

రీసైక్లింగ్ కోసం రైస్ మిల్లులకు తరలింపు..  

మామూళ్ల మత్తులో అధికారులు..

దౌల్తాబాద్: పేదల ఆకలిని తీర్చే రేషన్ బియ్యాన్ని కొందరు అధికారుల సహాయంతో వ్యాపారులు పక్కదారి పట్టిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తుండగా కొంతమంది వ్యక్తుల సహకారంతో మిల్లర్లు కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు నిమగ్నమై నిఘా కరువై దందా జోరుగా నడుస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ యంత్రాంగం తరచూ పట్టుకుంటున్నా అక్రమ రవాణా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికి అనేక మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినా దందా ఆగడం లేదు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తేనే దందాకు చెక్ పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేక రేషన్ బియ్యం దందా యదేచ్చగా సాగుతున్నది. మినీ వాహనాలలో అక్రమ రవాణా జరుగుతుందనడానికి పోలీసులకు పట్టుబడుతుండడమే నిదర్శనంగా నిలుస్తున్నది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి, తదితర గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు వాహనాలలో తీసుకోని వడ్డేపల్లిలో గ్రామ కేంద్రంగా కొన్నేండ్ల నుంచి దందా కొనసాగుతుంది.

గతేడాది డిసెంబర్ నెలలో వీరభద్ర రైస్ మిల్లులో 180 క్వింటాళ్ల రేషన్ బియ్యం పక్కదారి పట్టించేందుకు సిద్ధంగా ఉండడంతో పాటు దొడ్లపల్లి శివారులో అర్ధరాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా రేషన్ బియ్యంతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని  పట్టుకున్న విషయం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. ఇలా ఎన్నో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో వాహనాలను సీజ్ చేశారు. అక్రమ దందా ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నా జిల్లా పౌరసరఫరాల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కులను పట్టుకుని పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా, ఉన్నతాధికారులు ఎందుకు విచారణ చేపట్టడంలేదని, డీలర్లపై నిఘా ఎందుకు పెట్టడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి పేదల బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకొని పేదలకు న్యాయం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.