24-04-2025 06:34:45 PM
మానుకోటలో రేషన్ డీలర్ల నిరసన...
మహబూబాబాద్ (విజయక్రాంతి): రేషన్ డీలర్లకు క్వింటాలకు 300 రూపాయలు కమిషన్ ఇవ్వాలని, నెలకు 5 వేల రూపాయలు గౌరవ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రేషన్ డీలర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేషన్ డీలర్లకు కమిషన్ పెంచడంతో పాటు గౌరవ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిందని ఏడాది దాటిన తమకు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదన్నారు.
అలాగే గోదాము నుండి బయోమెట్రిక్ ద్వారా రేషన్ డీలర్లకు సరైన తూకం వేసి బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేరుగా గోదాము నుండి బియ్యం పంపడం వల్ల బస్తాకి మూడు నుంచి ఐదు కిలోల బియ్యం తక్కువగా వస్తున్నాయని ఆరోపించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను డీఎస్డీవో, సివిల్ సప్లై డీఎం కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు యాదగిరి, కార్యదర్శి వెంకటనారాయణ, కోశాధికారి మంజుల యాదయ్య, డివిజన్ అధ్యక్షుడు గొర్రె వెంకన్న, రామచంద్రరావు, జిల్లాలోని వివిధ గ్రామాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు.