03-04-2025 12:00:00 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 2 : (విజయక్రాంతి): ప్రభుత్వం నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టగా కొందరు రేషన్ డీలర్లు చేతివాటం చూపి పేద ప్రజల నోట్లు కొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని దనసరి రేషన్ షాప్ నెంబర్ 28 ఇన్చార్జి డీలర్ ప్రతి కుటుంబానికి ఇచ్చే రేషన్ బియ్యం లో సుమారు 750 గ్రాములు కోత పెడుతున్నారు.
బుధవారం రేషన్ డీలర్ ఇస్తున్న బియ్యం తీసుకువెళ్లిన కొందరికి తూకం పై అనుమానం రావడంతో ప్రైవేట్ వ్యక్తి వద్ద బియ్యాన్ని తూకం వేయించగా 750 గ్రాములు తక్కువగా ఉన్నట్లు చూపడంతో వెంటనే రేషన్ షాపు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న కేసముద్రం తాసిల్దార్ కార్యాలయం రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాబు అక్కడికి చేరుకొని వేయింగ్ మిషన్ పనితీరును పరిశీలించారు.
మరో వేయింగ్ మిషన్ తెప్పించి బియ్యం తూకం వేయగా 750 గ్రాములు అధికంగా చూపిస్తుండడంతో వెంటనే ఈ విషయాన్ని సివిల్ సప్లై అధికారులకు తెలియజేశారు. ఇదిలా ఉంటే రేషన్ డీలర్ 25 సంవత్సరాల క్రితం చనిపోగా అతని కుటుంబ సభ్యుల పేరుతో ఇంతకాలం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారని, అతనికి రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేదని గుర్తించారు.
వెంటనే రేషన్ షాపు విధుల నుంచి తప్పించి మరో రేషన్ డీలర్ కు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించాలని తాసిల్దార్ కు నివేదిక అందజేసినట్లు ఆర్‌ఐ బాబు తెలిపారు.