సాకులు చూపి సంక్షేమ పథకాల్లో కోత విధించడం సరికాదు
గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్
గజ్వేల్,(విజయక్రాంతి): అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు అందించాలని గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన గజ్వేల్ లో విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ నాయకుల, ప్రభుత్వ పెద్దల మాటలు కోటలు దాటేట్లు ఉంటే అమలులో మాత్రం చేతలు గడప దాటని తీరుగానే ఉన్నారు. ఎన్ని లక్షల మందికైనా ఎటువంటి కోతలు లేకుండా రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించినప్పటికీ అమలులో అది జరగడం లేదన్నారు. లక్షలాది కుటుంబాలు దరఖాస్తు చేసుకోగా, గ్రామ సభల్లో ప్రదర్శించాలని, దరఖాస్తు దారుల్లో 30-40% మందిని కూడా లబ్దిదారులుగా గుర్తించలేదన్నారు. గ్రామ సభల్లో అర్హులను గుర్తిస్తామని చెప్పిన ప్రభుత్వం కొంతమందిని మాత్రమే లబ్ధిదారులుగా గుర్తించి గ్రామాలకు పంపడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన రేషన్ కార్డుల లబ్దిదారులను గుర్తించారో కనీసం ఆ మార్గదర్శకాలు పాటించకుండా గ్రామసభల్లో నిర్ణయం చేయాల్సిన లబ్దిదారుల జాబితాను ప్రభుత్వమే గ్రామాలకు పంపడం సరికాదన్నారు.
ప్రభుత్వం కేవలం కొద్దిమందికే సంక్షేమ పథకాలను అందించి పథకాలు అందరికీ ఇచ్చేశాం అనే పద్దతిలో ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. రైతు భరోసాలో కోతలు పెట్టడం, జీరో కరెంట్ బిల్లుల విషయంలో, రూ.500లకే గ్యాస్ సిలిండర్ విషయంలో ఇందిరమ్మ భరోసాలో ఉపాధి కూలీల విషయంలో కోతలు పెట్టడం, ఋణ మాఫీ విషయంలో సగం మందికి కూడా మాఫీ చేయకుండానే మాఫీ జరిగిపోయిందని చెప్పడం, అర గ్యారంటీని ఆమలు చేసి ఆరు గ్యారంటీలు ఆమలు చేశామని అబద్దాలు ప్రచారం చేయడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారి పోయిందాన్నారు. గ్రామాలకు పంపిన రేషన్ కార్డు లబ్దిదారుల జాబితాలో పేర్లు రాని వారిలో ఆందోళన పెరుగుతుందని ప్రభుత్వం వెంటనే స్పందించి మిగితా లబ్దిదారుల విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన లబ్దిదారులందరికి రేషన్ కార్డులతో పాటు అన్ని సంక్షేమ పథకాలను ఎలాంటి కోతలు లేకుండా సాకులు చూపకుండా అందరికీ వర్తింప చేయాలని లేని పక్షంలో అర్హులైన లబ్దిదారులందరిని ఏకం చేసి ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన తెలపాల్సి వస్తుందని హెచ్చరించారు.