19-03-2025 12:08:28 AM
హుజూర్ నగర్,మార్చి 18: రాజీవ్ యువ వికాస పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు మీసేవ సెంటర్లకు వెళ్లిన నిరుద్యోగ యువతకు రేషన్ కార్డు రూపంలో బ్రేక్ పడుతుంది. వెబ్ సైట్ లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడంతో రేషన్కార్డు నెంబర్ అడుగుతుంది. రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకానికి అర్హులవుతారని రేషన్ కార్డ్ లేని వారి అప్లికేషన్ ను వెబ్ సైట్ లో తీసుకోవడం లేదని మీసేవ సెంటర్ నిర్వాహకులు సహితం చెబుతున్నారు.
సుమారు 5 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం రూ.6వేల కోట్ల రాయితీ రుణాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో లబ్ధిదారుడికి సుమారు రూ.4 లక్షల వరకూ రాయితీ రుణం ఉంటుంది. దరఖాస్తులకు ఏప్రిల్ 5వ తేదీ వరకూ గడువిచ్చారు.
ఒక రేషన్ కార్డులో ఎంత మంది అర్హులు ఉన్నా ఒక్కరికే అవకాశం. కాగా పాత రేషన్ కార్డులలో పేర్లను తొలగించుకోని కొత్త రేషన్ కార్డుల కోసం వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. రేషన్ కార్డు లేని వారు, ఒకే కార్డులో ఉన్న ఉమ్మడి కుటుంబాలలో అర్హులు ఈ పథకానికి దూరం అవుతున్నారు.
మీ సేవకు లైన్లు...
రాజీవ్ యువ వికాస పథకానికి ఆన్లైన్లో దరఖాస్తులకు జిల్లాలోని లబ్దిదారులు మీ సేవ కేంద్రాలకు లైన్లు కడుతున్నారు. దరఖాస్తులకు కుల, ఆదాయ దృవపత్రాలను జతచేయవలసి ఉండటంతో దరఖాస్తులు చేసుకుంటున్నారు.
అయితే రేొషన్ కార్డు తప్పనిసరి కావడంతో ఇప్పటికి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఎక్కడి నుంచి తీసుకురావాలని,రేషన్ కార్డు లేని నిరుద్యోగ యువత పరిస్థితి ఏమిటని, తాము ఇక ఈ పథకానికి అర్హులం కాదా అని ప్రశ్నిస్తున్నారు.
రేషన్ కార్డులు లేని నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తుందా,లేదా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసి దరఖాస్తు తేదీని పొడిగిస్తుందా అనేది అర్థం కాక అయోమయంలో నిరుద్యోగ యువత ఉన్నారు.