calender_icon.png 18 January, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డుల పరేషాన్!

18-01-2025 01:49:07 AM

  1. తల్లిదండ్రుల కార్డుల్లో పేర్లున్న దరఖాస్తుదారులే ఎక్కువ
  2. నిబంధనల ప్రకారం.. ఏ కార్డులో పేరులేని వారే అర్హులు
  3. డిలీట్ ఆప్షన్ ఇవ్వని సివిల్ సప్లు శాఖ

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): తెలంగాణవ్యాప్తంగా కొత్త రేష న్ కార్డులకు లబ్ధిదారుల ఎంపికలో సాంకేతిక సమస్య తలెత్తింది. పౌరసరఫరాల శాఖ డిలీట్ ఆప్షన్ ఇవ్వకపోవ డంతో లక్షలాది మంది లబ్ధిదారులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. బీఆర్‌ఎస్ పాలించిన పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు జారీకాలేదు.

గడిచిన దశాబ్దం లో లక్షలాది మంది పెళ్లిళ్లు చేసుకున్నా రు. వేరు కాపురాలు పెట్టుకున్నారు. వారికి పిల్లలు కూడా కలిగారు. వారం తా ఇప్పుడు రేషన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుందని భావిస్తున్న తరుణంలో సాంకేతిక సమస్య వారి పాలిట గండంగా మారింది.

ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ప్రభు త్వం ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. 13 లక్షల మంది రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. పౌరసరఫరాల శాఖ ఆన్‌లైన్‌లో డిలీట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు కేవలం లక్ష మంది లోపే రేషన్ కార్డులకు అర్హులవుతారని ఓ అంచనా.

ఏంటీ సాంకేతిక సమస్య?

రాష్ట్రప్రభుత్వం ఈ నెల 26న కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కులగణన డేటా ఆధారంగా రేషన్‌కార్డులు లేనివారి జాబితా సిద్ధం చేయాలని మండలస్థాయిలో ఎంపీడీవోలకు అప్పగించింది. ఎంపీడీవోలు ఇప్పటికే జాబితా సిద్ధం చేసి పౌరసరఫరాల శాఖకు పంపించారు.

పౌరసరఫరాల శాఖ  జాబితాను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఆధార్ గుర్తింపు ద్వారా దరఖాస్తుదారుకు గతంలో రేషన్ కార్డు ఉందా? లేదా ఏదైనా రేషన్‌కార్డులో దరఖాస్తుదారు పేరు ఉందా? అనే అంశాలను గుర్తిస్తుంది. ఈ చెకింగ్‌లో మెజార్టీ దరఖాస్తుదారుల పేర్లు తమ తల్లిదండ్రుల రేషన్‌కార్డుల్లో ఉన్నట్లు తేలింది.

ఏ కార్డులోనూ పేరు లేని వారే కొత్త కార్డుకు అర్హులని పౌర సరఫరాల శాఖ మెలికపెట్టడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రభుత్వం ముందు డిలీట్ ఆప్షన్ ఇచ్చి ఉంటే, తాము తల్లిదండ్రుల కార్డుల నుంచి తమ పేర్లను తొలగించుకునే వాళ్లమని, ఆ ఆప్షన్ ఇవ్వకుండానే అధికారులు అర్హులను ఎంపిక చేయడంపై దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కొరవడిన స్పష్టత..

పౌర సరఫరాల శాఖ అర్హులైన వారి జాబితాను ఎంపీడీవోలకు పంపించిన తర్వాత, ఎంపీడీవోలు వాటిని గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు పంపిస్తారు. అనంతరం పంచాయతీకార్యదర్శులు గ్రామసభలు నిర్వహించి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానున్నది.

పంచాయతీ కార్యదర్శులకు అందిన జాబితాలో తమ పేర్లు లేకపోవడం చూసి దరఖాస్తుదారులు ఆందోళ నకు గురవుతున్నారు. మరోవైపు కొత్త రేషన్ కార్డులకు అర్హుల ఎంపికపైనా ప్రజ ల్లో అనుమానాలు ఉన్నాయి.

లబ్ధిదారుల జాబితా ఒకటి మాత్రమే ఉంటుందా? లేక విడతల వారీగా ఉంటుందా ? ఈ నెల 26 తర్వాత కూడా కార్డులు జారీ అవుతాయా ? కావా? అన్న అంశాలపై స్పష్టత కొరవడింది. ఈ విషయంపై అటు పౌరసరఫరాల శాఖ గానీ, ఇటు ఎంపీడీవోలు గానీ ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. దీంతో ఇప్పుడు విడుదలైన జాబితానే ఫైనల్ అయి ఉంటుందని కొందరు నిరాశ చెందుతున్నారు.

స్థానిక ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు అస్త్రంగా..

రాష్ట్రప్రభుత్వం మెజార్టీ పథకాలను రేషన్ కార్డుల ఆధారంగా ఇస్తుండడంతో ఈసారి ఏకంగా 13 లక్షల మంది కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సాంకేతిక సమస్యతో లక్షలాది మందికి కొత్త రేషన్‌కార్డు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ అంశాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కార్డులు పెరిగితే, వ్యయం కూడా పెరుగుతుందనే ఉద్దేశంతోనే రాష్ట్రప్రభుత్వం కొర్రీలు పెడుతున్నదని విరుచుకుపడేందుకు అవకాశం ఉంది. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకండా రాష్ట్రప్రభుత్వం ముందే మేల్కొనాల్సిన అవస రం ఉందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నది.