calender_icon.png 10 October, 2024 | 4:53 AM

రతన్ టాటా ఇకలేరు

10-10-2024 02:37:20 AM

1937-2024

  1. ముంబైలో అనారోగ్యంతో తుది శ్వాస
  2. దేశ పారిశ్రామికరంగంపై చెరగని ముద్ర
  3. టాటా గ్రూప్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చిన మేధావి
  4. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం

ముంబై, అక్టోబర్ 9: భారతదేశ పారిశ్రామిక రంగంలోని మేరుపర్వతం ఒరిగి పోయింది. భారత్‌లో పరిశ్రమలంటే టక్కున గుర్తొచ్చే టాటాల వ్యాపార సామ్రాజ్యాన్ని విశ్వప్యాప్తం చేసిన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు.

అనారోగ్యంతో బుధవారం ముంబైలోని బ్రీచ్‌క్యాండీ దవాఖానలో చేరిన రతన్‌టాటా పరిస్థితి విషమించటంతో అత్యవసర చికిత్స అందించారు. అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 

టాటా వృక్షాన్ని వటవృక్షంగా మార్చి

రతన్ టాటా అసలు పేరు రతన్ నావల్ టాటా. ఆయన 1937 డిసెంబర్ 28న గుజరాత్‌లోని సూరత్‌లో జన్మించారు. ఆయన తండ్రి పేరు నావల్ టాటా. రతన్‌టాటా తాత హోర్ముస్‌జీ టాటా జెమ్‌షడ్‌జీ టాటాకు రక్తసంబంధీకుడు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడైన జెమ్‌షడ్‌జీ టాటా కుమారుడు రతన్‌జిత్ టాటా రతన్ టాటాను దత్తత తీసుకొన్నారు.

రతన్ టాటా ముంబైలో ప్రాథ మిక విద్యాభ్యాసం పూర్తిచేసి, కార్నెల్ యూనివర్సిటీ కాలేజీలో ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ చదివారు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత 1961లో టాటా గ్రూప్‌లో చేరారు. మొదట వ్యాపార అనుభవం కోసం టాటా స్టీల్ కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరిన ఆయన.. తన అసాధారణ ప్రజ్ఞా పాటవాలతో జేఆర్‌డీ టాటా వారసుడిగా 1991లో టాటా గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

అప్పటివరకు సంప్రదాయ పారిశ్రామిక విధానాలు అనుసరించిన టాటా గ్రూప్‌ను రతన్ టాటా ఆధునిక యుగంలోకి పరుగులు పెట్టించారు. 21 ఏండ్లపాటు టాటా గ్రూప్ చైర్మన్‌గా కొనసాగిన రతన్ టాటా ఆ సంస్థ ఆదాయాన్ని ఏకంగా 40 రెట్లు పెంచారు.  లాభాలను 50 రెట్లు చేశారు. దేశంలో లక్షల మంది పేద పిల్లల విద్యకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

తన సంపాదనలో దాదాపు 65 శాతం దాతృత్వ కార్యక్రమాలకే వెచ్చిం చారు. రతన్‌టాటా దేశంలోని ఓ తరానికి తరగని స్ఫూర్తిగా నిలిచారు. ఉద్యోగులందరితో ఆత్మీయుడిలా కలిసిపోవటం ఆయన ప్రత్యేకత. రతన్ టాటా మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. దేశం గొప్ప విజనరీని కోల్పోయిందని ప్రధాని పేర్కొన్నారు.