calender_icon.png 19 April, 2025 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మర్కుక్ రేషన్ షాప్‌లో బియ్యం బస్తాలో ఎలుక

10-04-2025 01:33:34 AM

  1. బియ్యం పంపిణీకి బస్తా తెరిచేసరికి చనిపోయి దర్శనమిచ్చిన ఎలుక 

రైస్ మిల్లర్ల నిర్లక్ష్యంతో  సంకటంగా మారిన  బియ్యం

గజ్వేల్, ఏప్రిల్ 9: రేషన్ బియ్యం ద్వారా పేదల ఆకలి తీర్చుతున్న ప్రభుత్వ లక్ష్యాన్ని రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం నీరుగారుస్తుంది. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోని మర్కుక్ మండల కేంద్రంలో రేషన్ దుకాణంలో  బియ్యం పంపిణీ చేద్దామని రేషన్ డీలర్ బస్తా  తెరువగా అందులో చనిపోయిన ఎలుక దర్శనమిచ్చింది. దీంతో బియ్యం కోసం వచ్చిన వినియో గదారులు భయాందోళనకు గురయ్యారు. ఆ బియ్యం మాకొద్దంటూ చెప్పడంతో ఆ బస్తా  పక్కన పెట్టి వేరే బస్టాండ్ నుండి డీలర్ బియ్యం పంపిణీ చేశాడు.

కాగా మర్కుక్ రేషన్ దుకాణానికి సరఫరా చేసిన  బియ్యం బస్తా పై కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామం, సిరిసాపల్లికి చెందిన  ఎస్ ఆర్ ట్రేడర్స్ వారు బియ్యం బస్తాలు ప్యాకింగ్ చేసినట్టుగా ఉంది.  ఎస్ ఆర్ ట్రేడర్స్ నిర్వాహకులను సంప్రదించగా హమాలీలు బియ్యం ప్యాకింగ్ చేసే సమయంలో అనుకోకుండా ఎలుక పడిపోయి ఉండొచ్చని, అలాంటి సమయంలో ఎవరూ చూడకపోవచ్చు అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

ఎస్ ఆర్ ట్రేడర్స్ లో ప్యాకింగ్ అయిన బియ్యం బస్తా బెజ్జంకి గోదాంకు చేరుకొని అక్కడ నెల రోజులుగా నిల్వ ఉండి గజ్వేల్ ఎంఎల్‌ఎస్  పాయింట్ కు చేరింది. అక్కడినుండి మర్కుక్   రేషన్ దుకాణానికి చేరుకున్న బియ్యం బస్తాను బుధవారం తెరిచి చూడగా చనిపోయి కుళ్ళిపోయిన ఎలుక ఉంది. గతంలో ఎలుకల ద్వారానే వచ్చిన ప్లేగు మహమ్మారితో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే.

ఇలా రైస్ మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలకే కాదు పాములు కూడా విషం కక్కిపోతే  ఆ బియ్యాన్ని ప్రజలు భుజిస్తే వారి ప్రాణాలకు ఎవరు రక్షణగా ఉంటారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రైస్ మిల్లర్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే  ఇలాంటి ఘటన చోటు చేసుకుంటున్నాయని, ఇకనైనా అధికారులు పటిష్టంగా  తనిఖీలు నిర్వహించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.