calender_icon.png 23 January, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లికార్జునపల్లిలో రాష్ర్టకూట శాసనం

22-01-2025 12:44:36 AM

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లికార్జునపల్లి గ్రామంలో మెదక్ జిల్లా శాసనసంపుటిలోని మొదటి శాసనం వుంది. ఈ శాసనం క్రీ.శ. 846 సెప్టెంబర్ 25న వేయబడ్డ శాసనం. రాష్ర్టకూటప్రభువు అమోఘవర్షుని కాలంలో మహాసామంతుడు పాణూరవాడి కొమ్మన ప్రభువు శంకరగండ 27వేలనాడు పురనగరం పిఱియ పిప్పరిగెలోని ఈశ్వరాలయంలో ఉండే.. బంకెయ.. కాళ్ళుకడిగి 12మర్తురుల నీర్నేల ఒక మర్తురు, ద్రమ్మం సిద్ధాయంగా తమ వంశోద్భవుడు పెర్మాడి పరియ పిప్పరిగెలో.. మునిపల్లె జీయప్పర జినాలయానికి చెందిన వసుదేవ భటారుని గౌరవించి చేసిన దానం.

మల్లికార్జునపల్లిలోని గుడి ద్వారంవద్ద జైనబసది ముందర వుండే రెండువైపుల రెండు ఏనుగుల రెయిలింగ్ వుంది. గుడి స్తంభాలు రాష్ర్టకూటశైలికి చెందినవి. మల్లికార్జునపల్లి శివాలయ మంటపంలో కాకతీయశైలి స్తంభాలు, ఒకే గద్దెపై వేర్వేరు కాలాలకు చెందిన రెండు నందులు నిలిపివున్నాయి.

గర్భగుడిలో చతురస్రాకారపు పానవట్టంలో అమర్చిన కాకతీయశైలి శివలింగం, పక్కన కాకతీయానంతరశైలి మహేశ్వరి విగ్రహం వున్నాయి. ఎత్తు తక్కువున్న చిన్నగుడి ముందర రెండు జైన తీర్థంకరుల విగ్రహాలున్నాయి. పక్కన మంటపంవలెవున్నచోట శివలింగం, నంది వున్నాయి. తలపై త్రిస్తరఛత్రంతో ధ్యానాసనభంగిమలో కనిపిస్తున్న శిల్పాలలో ఒకటి జైన తీర్థంకరుడు ఋషభుడు. రెండవ జైన తీర్థంకర శిల్పం కూడా ఋషభునిదే. రాష్ర్టకూటశైలీ శిల్పాలు.

గుడి ప్రాంగణంలో రెండు అమ్మదేవతల శిల్పాలున్నాయి. కాకతీయా నంతర శైలివి. ప్రాంగణంలో నాగశిల్పాలెన్నో వున్నాయి. ఆలయప్రాంగ ణంలో రెండు నంది స్తంభాలున్నాయి. ప్రాంగణంలోనే మల్లికార్జున పల్లి శాసనఫలకం ఉంది. మూడడుగుల ఎత్తున ద్విభుజుడైన గణపతి శైలినిబట్టి రాష్ర్టకూటులకాలా నికి చెందినది. జైన సంప్రదాయ శిల్పం.

రాష్ర్టకూటశైలికి చెందిన వీరగల్లులో వీరుడు ఈటెతో యుద్ధరంగంలో ఉన్నాడు. శివాలయ సమీపంలోనే మెట్లబావి వుంది. పూర్వపు బావికి ముస్లిం పరిపాలకులకాలంలో మార్పులు, చేర్పులు చేయబడ్డట్టుంది. ప్రాంగణంలో ఉన్న జైనబసది ప్రవేశద్వారబంధానికి సంబంధించిన ఒక శేరె, దానికి అంచున తామరపూలరేకులు, కింది కాయోత్ససర్గ భంగిమలో తీర్థంకరుని శిల్పం వున్నాయి.