20-03-2025 02:30:28 AM
సిద్దిపేట, మార్చి 19 (విజయక్రాంతి): మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అనుచరులు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో అక్రమాలకు పాల్పపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వాఖ్యలు దుమారం లేపాయి. ఆ ఆరోపణలపై భగ్గుమన్న కాంగ్రెస్ నాయకులు బెజ్జెంకిలో ధర్నాకు బుధవారం పిలుపునిచ్చారు.
కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆనంతరం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ముక్కిస రత్నకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మానకొండూరులో తన ఉనికిని కాపాడుకునేందుకు రసమయి అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. లేదంటే ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
దీంతో సమావేశం ముగించాలని పోలీసులు ఆదేశించడంతో కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఇంతలోనే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు రసమయి ఫామ్‌హౌస్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
తప్పులెత్తి చూపితే తప్పేంటి: రసమయి
ప్రభుత్వంలో ఉన్నవారు చేసిన తప్పులను ఎత్తి చూపితే తప్పేంటని రసమయి బాలకిషన్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు దాడులకు యత్నించడం సిగ్గుచేటన్నారు. తప్పులను ఎత్తిచూపితే ఎమ్మెల్యే దాడులకు పూరమాయించడం దారుణమన్నారు. తనను గృహ నిర్బంధం చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు.