calender_icon.png 26 December, 2024 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో రసాభాస

05-11-2024 01:02:12 AM

  1. ఆర్టికల్ 370 రద్దుపై పీడీపీ ఎమ్మెల్యే తీర్మానం
  2. వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యేలు

శ్రీనగర్, నవంబర్ 4: దాదాపు ఆరేండ్ల తరువాత జమ్ము కశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయిదు రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి.  అయితే తొలిరోజే సమావేశాల్లో గందరగోళం నెలకొని రసాభాసగా మారాయి. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీ (పీడీపీ)కి చెందిన పుల్వామా ఎమ్మెల్యే వహీద్ పారా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరు స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్‌కు తీర్మానాన్ని అందేశారు. అసెంబ్లీ ఎజెండాలో ఈ అంశం లేకపోయినా ప్రజల కోరిక మేరకు స్పీకర్ తన అధికారాలను ఉపయోగించి చర్చించాలని ఆయన కోరారు. అయితే ఈ తీర్మానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీకి చెందిన 28 మంది ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు.

ఈ తీర్మానాన్ని అనుమతించకూడదని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తీర్మానం ప్రవేశపెట్టిన పారాను సస్పెండ్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే శ్యామ్‌లాల్ శర్మ డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న బీజేపీ సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ కోరినా వారు ఆందోళన కొనసాగించడంతో కాసేపు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.

కాగా అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన స్పీకర్ రహీమ్ మాట్లాడుతూ తీర్మానాన్ని ఇంకా అంగీకరించలేదని చెప్పారు.  ఈ తీర్మానానికి ప్రాధాన్యత లేదని సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర హోదా పునరుద్ధరణకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఒమర్ పేర్కొన్నారు. కాగా 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

జమ్ముకశ్మీర్ స్పీకర్‌గా అబ్దుల్ రహీమ్

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌గా అధికార నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ రాథర్ (80) ఎన్నికయ్యారు. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు స్పీకర్‌ను ఎన్నుకున్నారు. ప్రొటెం స్పీకర్ ముబారక్ గుల్.. స్పీకర్‌గా అబ్దుల్ రహీమ్ పేరును ప్రతిపాదించారు.

చరారే-ఇ-షరీఫ్ నియోజకర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. ఇప్పటివరకు ఆయన ఏడుసార్లు విజయం సాధించారు. అబ్దుల్ గతంలో కూడా స్పీకర్‌గా వ్యవహరించారు.  కాగా డిప్యూటీ స్పీకర్‌గా బీజేపీకి చెందిన నరేంద్రసింగ్ రైనా ఎన్నికయ్యారు.