28-04-2025 12:20:16 AM
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): రాష్ర్ట చరిత్రలో తొలిసారి పేగు మార్పిడి శస్త్రచికిత్సను ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందం విజయవంతంగా నిర్వహించారు. 40 ఏళ్ల పురుష రోగి షార్ట్‌గట్ సిండ్రోమ్ (పేగులు పనిచేయని స్థితితో, పైపుల ఆధారంగా ఫ్లూయిడ్స్ తీసుకుంటున్న (టోటల్ పరెంటరల్ న్యూట్రిషన్) దశలో ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చేరారు.
అత్యంత క్లిష్టమైన ఈ కేసును ఉస్మానియా వైద్యులు ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. కడుపులోని ప్రధాన రక్తనాళం సుపీరియర్ మెసెంటరిక్ ఆర్టరీ అడ్డంకి వల్ల అతడి చిన్నపేగు, కుడి కాలన్‌ను గ్యాంగ్రీన్ కారణంగా తొలగించారు. ఇన్ఫెక్షన్లు, ప్రధాన నరాల్లో గడ్డకట్టడంతో రోగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ నెల 19న ఉస్మానియా వైద్య బృందం అవయవదానం చేసిన మృతుడి శరీరం నుంచి సేకరించిన చిన్న పేగును రోగికి సర్జరీ చేసి విజయవంతంగా మార్పిడి చేశారు.
ప్రస్తుతం రోగి నోటి ద్వారా ఫ్లూయిడ్స్, ఆహారాన్ని తీసుకుంటున్నాడు. రోగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత 7వ రోజు నిర్వహించిన ప్రోటోకాల్ ఎండోస్కోపీలో మార్పిడి చేసిన పేగు గులాబీ రంగులో, సహజస్థితిలో ఆరోగ్యవంతంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. బయాప్సీ నివేదికలోనూ ఇబ్బందులు లేవని తేల్చారు.
తెలంగాణ వైద్య చరిత్రలో ఈ విజయం ప్రభుత్వ వైద్యం పట్ల ఎంతో నమ్మకాన్ని కలిగిస్తుందని ఉస్మానియా వైద్యులు తెలిపారు. గతంలో అనేక అత్భుతాలు చేసిన ఉస్మానియా వైద్యులు పేగు మార్పిడితోనూ చరిత్ర సృష్టించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కొనియాడారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగేలా చేసినందుకు వైద్య బృందాన్ని ఆయన అభినందించారు.
ఉస్మానియా వైద్యులకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు..
పేగుమార్పిడి ఆపరేషన్‌ను విజయవంతం చేసిన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. షార్ట్‌గట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఓ 40 ఏళ్ల వ్యక్తి ఎన్ని ఆసుపత్రులు తిరిగినా లాభం లేకపోవడంతో చివరగా ఉస్మానియా ఆసుపత్రిని సంప్రదించాడు. ఉస్మానియా ఆసుపత్రి వైద్య బృందం ఆ వ్యక్తికి శస్త్రచికిత్స చేసేందుకు ముందుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా పేగుమార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది.