- మిట్రల్ స్టెనోసిస్ రోగికి ప్రాణదానం
- తొలిసారిగా టీఎంవీఆర్ శస్త్రచికిత్స విజయవంతం
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): నిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేసి ఓ రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. హైదరాబాద్‌లో మొదటిసారిగా అత్యంత క్లిష్టమైన మిట్ర ల్ స్టెనోసిస్‌తో బాధపడుతున్న రోగికి అరుదైన ట్రాన్స్‌కాథెటర్ మిట్రల్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ (టీఎంవీఆర్) శస్త్రచికిత్సను విజయవంతంగా చేపట్టారు.
56 ఏళ్ల వయసున్న రోగి మిట్రలో స్టెనోసిస్‌తో బాధపడుతూ మిట్రల్ యాన్యులర్ కాల్సిఫికేషన్ (ఎంఏసీ) కారణంగా చికిత్స కోసం నిమ్స్‌లో చేరాడు. రోగి అప్పటికే బీపీ, షుగర్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)తో బాధపడుతున్న నేపథ్యంలో సాంప్రదాయక శస్త్రచికిత్సలో మిట్రల్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ అత్యంత రిస్క్‌తో కూడుకుని ఉంటుంది.
ఈ నేపథ్యంలో నిమ్స్‌లోని కార్డియాలజీ విభాగాధిపతి డా. బి. శ్రీనివాస్, డా. మణికృష్ణ, డా. అభినయ్ రెడ్డి, డా. కె. అనురాగ్‌లతో కూడిన బృందం ప్రత్యామ్నాయ, అత్యాధునిక లాంపూన్ చికిత్స విధానం ద్వారా శస్త్రచికిత్స చేసి రోగి ప్రాణాలు కాపాడారు.
టీఎంవీఆర్ అనేది అత్యాధునికమైన మినిమం ఇన్వాసివ్ ప్రక్రియ చికిత్స విధానమని, ఇది ఓపెన్-హార్ట్ సర్జరీ అవసరం లేకుండా రోగి మిట్రల్ వాల్వ్‌ను మార్చేందుకు ఉపయోగించే వైద్య విధానమని డా. బి శ్రీనివాస్ తెలిపారు.
ఈవిధానంలో రోగి కేవలం రెండు రోజుల్లోనే కోలుకుని ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని వివరించారు. హృద్రోగ సంబంధ వ్యాధుల్లో క్లిష్టమైన స్థితిలో ఉన్న రోగులెందరికో ఈ వైద్య విధానం ప్రాణాలపై తిరిగి ఆశలు కల్పిస్తుందని ఆయన తెలిపారు.