ఎంసీజీ హానర్ బోర్డులో చోటు
మెల్‌బోర్న్: భారత వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా, యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డిలకు అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాత మెల్‌బోర్న్ స్టేడియం హానర్ బోర్డులో ఈ ఇద్దరు చోటు దక్కించుకున్నారు. ఆసీస్ గడ్డపై అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు హానర్ బోర్డులో చోటు కల్పించడం ఆనవాయితీగా వస్తోంది.
తాజాగా నాలుగో టెస్టులో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ హైదరాబాదీ నితీశ్‌కుమార్ వీరోచిత శతకం సాధించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కష్టాల్లో ఉన్న సమయం లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుత శతకంతో అలరించాడు. దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును కూడా బద్దలుకొట్టా డు.
ఇక బుమ్రా ఇదే టెస్టులో 9 వికెట్లు పడగొట్టి 200 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఓవరాల్‌గా బోర్డర్ గావస్కర్ సిరీ స్‌లో నాలుగు టెస్టులు ముగిసేసరికి 30 వికెట్లతో టాప్ స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరి ఘనతలను ప్రత్యేకంగా ప్రస్తావించిన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ యాజమా న్యం హానర్ బోర్డులో బుమ్రా, నితీశ్ పేర్ల ను అంటించింది.
దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ బుధవారం ఎక్స్ వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగా హానర్ బోర్డులో తన పేరును చూసుకున్న నితీశ్ మురిసిపోతూ ఫోటోలకు ఫోజిచ్చా డు. 2020-21 ఆస్ట్రేలియా పర్యటన సం దర్భంగా ఎంసీజీ హానర్ బోర్డులో అజిం క్యా రహానే చోటు దక్కించుకున్నాడు.
ఐసీసీ రేటింగ్స్‌లో బుమ్రా చరిత్ర..
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న బుమ్రా రేటింగ్ పాయింట్స్‌ను మరింత పెంచుకున్నాడు. ప్రస్తుతం 907 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న బుమ్రా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత ఆటగాడిగా బుమ్రా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో భారత స్పిన్నర్ అశ్విన్ (904 పాయింట్లు) రికార్డును బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా జాబితాలో ఈ ఘనత సాధించిన 17వ ఆటగాడిగా నిలిచాడు.