26-04-2025 05:11:14 PM
సేవలు ఫలించి.. డాక్టరేట్ వరించి..
అరోరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ చైర్మన్ తాళ్లూరి తిరుణ హరిబాబుకు అరుదైన గౌరవం..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఓ సాధారణ నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు పూర్తి చేసుకుని ఇంతింతై వటుడింతై అన్న చందంగా తాను సంపాదించిన దానిలో సమాజ సేవకు ఉపయోగిస్తూ, తనకున్న జ్ఞానాన్ని విద్యార్థులకు ఉచితంగా అందిస్తూ అరుదైన గౌరవం డాక్టరేట్ పురస్కారం అందుకున్నారు. పాల్వంచ పట్టణంలో అరోరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ చైర్మన్ తాళ్లూరి తిరుణ హరిబాబు తెలుగు రాష్ట్రాల్లో విద్య, సామాజిక రంగాల్లో అందించిన సేవలకు తమిళనాడు రాష్ట్రం కు చెందిన ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమి( ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రిసెర్చ్ యూనివర్సిటీ ) ఆధ్వర్యంలో శనివారం డాక్టరేట్ పురస్కారం ప్రధానం చేశారు.
ఇందులో భాగంగా సంస్థ ప్రతినిధులు డాక్టర్ అరుణ్ చిన్న దురయ్, డాక్టర్ శ్రీనాథ్, డాక్టర్ కృష్ణ మూర్తి, డాక్టర్ నరసింహ మూర్తి, డాక్టర్ రవి కుమార్ ల చేతులు మీదుగా డాక్టరేట్ గౌరవం అందుకున్నారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ బాల్యం నుంచి ఎదుర్కొన్న ఒడిదుడుకులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చిన్న తనం నుంచి పడ్డ కష్టాలు అతన్ని గౌరవ పురస్కారాన్ని అర్హుడిగా మార్చాయన్నారు. అనుకున్నది సాధించడం చదువుకునే వయసు నుంచి అలవాటని, అందుకే విద్యా సంస్థలు స్థాపించి పేద విద్యార్థులకు ఉచితంగా అందుబాటుకి విద్యను తీసుకొచ్చా అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చదువుకునే విద్యార్థులకు ఆర్థికంగా సహకరిస్తున్నామన్నారు.
ఎంబీబీఎస్, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులు చదివే విద్యార్థులకు ఫీజు కడుతున్నట్టు గుర్తు చేశారు. గణితంలో స్వయంగా ఇంటర్మీడియెట్ పుస్తకం రచించినట్టు హరిబాబు తెలిపారు. వీటితో పాటు వృద్ధులకు తన వంతుగా దుస్తులు, అన్నదానం ఇతరత్రా సహాయం అందిస్తున్నామన్నారు. గత నాలుగేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో విద్యా, సామాజిక రంగాల్లో సేవలు అందిస్తున్నమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత బాధ్యతగా పనిచేస్తానని తెలిపారు. హరిబాబు డాక్టరేట్ అందుకోవడం పట్ల తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.