ప్రజలకు అందుబాటులో 24 గంటలు
జిల్లా కార్యాలయంలో సమాచారం చేరవేసేందుకు సెల్ ఏర్పాటు
డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ హరీష్ రాజ్
మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంతో పాటు అన్ని పీహెచ్సీలలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎం అండ్ హెచ్ ఓ మాట్లాడుతూ... అవసరమైతే తప్ప బయటకు రావద్దని, వర్షాల నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలుతాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉంటారని, వ్యాధులు ప్రబలినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.
వర్షాల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో 24 గంటల పాటు సమాచారాన్ని చేరవేసేందుకు సెల్ ను ఏర్పాటు చేశామని, మారుమూల ప్రాంతాలు, రహదారి లేని గ్రామాలు, వరద ముంపుతో ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో ప్రసవానికి సిద్ధంగా ఉన్న వారిని 15 రోజుల ముందుగానే వైద్య ఆరోగ్య సిబ్బంది ఆసుపత్రికి తరలించాలన్నారు. ఇందు కోసం 102 అంబులెన్సులతోపాటు ఇతర ప్రభుత్వ అంబులెన్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రులలో మందులు అందుబాటులో ఉన్నాయని, రోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంచిర్యాలలోని రాపిడ్ రెస్పాన్స్ కంట్రోల్ రూం కోసం 91770 84068లో సంప్రదించవచ్చన్నారు.