కోల్‌కతా వైద్యురాలి హత్యలో భయానక విషయాలు
కోల్‌కతా, ఆగస్టు 12: కోల్‌కతా మెడికల్ కాలేజీలో ఓ వైద్యురాలిపై లైంగికదాడి చేసి, హత్యచేసిన కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్జీ కాలేజీలో నిందితుడు నేరం చేసిన తర్వాత తన నివాసానికి వెళ్లి ఏమీ జరుగనట్టే హాయిగా నిద్రపోయాడని పోలీసులు తెలిపారు. తెల్లారి పొద్దున్నే లేచి సాక్ష్యాలను నాశనం చేసేందుకు తన దుస్తులను శుభ్రంగా ఉతుక్కున్నాడని గుర్తించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు సోమవారం విధులను బహిష్కరించారు. పరిస్థితి తీవ్రంగా మారుతుండటంతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. ఈ కేసును వీలైనంత త్వరగా తేల్చాలని లేదంటే దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తానని సోమవారం ఆమె పోలీసులకు అల్టిమేటం జారీచేశారు.