19-03-2025 12:42:22 AM
డీఆర్‌ఐ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు...
బెంగళూరు: దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడిన రన్యారావు కేసు రోజురోజుకో మలుపు తిరుగుతున్నది. కేసుపై దర్యాప్తును వేగవంతం చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) తాజాగా మరికొన్ని వివరాలు వెల్లడించింది. నిందితురాలికి అంతర్జాతీయ గోల్డ్ మర్చంట్స్‌తో డీలింగ్స్ ఉన్నాయని స్పష్టం చేసింది. స్మగ్లింగ్ కేసులో మరో నిందితుడు తరుణ్‌రాజ్‌కు నిందితురాలికి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని, వీరిద్దరూ కలిసి 2023లో దుబాయ్‌లో విరా డైమండ్స్ ట్రేడింగ్ అనే కంపెనీని స్థాపించారని తెలిపింది.
అప్పటి నుంచి వీరు పార్ట్‌నర్స్‌గా కొనసాగుతున్నారని, రన్యారావు తన పలుకుబడిని వినియోగించి వ్యాపారాన్ని విస్తరించిందని పేర్కొన్నది. అలాగే వీరిద్దరికీ బ్యాంకాక్, జెనీవాకు చెందిన అనేక మంది గోల్డ్ మర్చంట్స్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వివరించింది. వారి నుంచి బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి, నిందితులు దుబాయ్ బ్యాంక్ ఖాతాల ద్వారా డబ్బు చెల్లించేవారని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాము దుబాయ్ కేంద్రంగా రన్యారావు, తరుణ్‌రాజ్‌కు జరిపిన కరెన్సీ లావాదేవీలను పరిశీలిస్తున్నామని తెలిపింది. మరోవైపు గోల్డ్ స్మగ్లింగ్ వెనుక నిందితురాలి సవతి తండ్రి రామచంద్రరావు పాత్రపై లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.