- నిలిచిపోయిన నగదు ఉపసంహరణ, యూపీఐ సేవలు
- దేశవ్యాప్తంగా సుమారు 300 బ్యాంకుల ఖాతాదారులపై ప్రభావం
న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశవ్యాప్తంగా సుమారు 300 చిన్నస్థాయి బ్యాంకులకు చెందిన ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ, యూపీఐ లావాదేవీలు జూలై 29వ తేదీ నుంచి నిలిచిపోయాయి. ఆయా బ్యాంకులకు సీ టెక్నాలజీస్ అనే సంస్థ సాంకేతిక సేవలు అందిస్తోంది. ఈ సంస్థపై ర్యాన్సమ్‌వేర్ దాడి జరగడంతో సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఖాతాదార్లపై ప్రభావం పడింది.
300 బ్యాంకుల్లో గత 2-3 రోజులుగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని యూపీఐ సేవలను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేసింది. ఈ బ్యాంకుల వినియోగదారులు ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ, యూపీఐల ద్వారా లావాదేవీలు నిర్వహించడం వంటివి నిలిచిపోయాయని పేర్కొంది. కాగా, సదరు బ్యాంకులు దేశంలోని మొత్తం చెల్లింపు వ్యవస్థలో 1 శాతం కంటే తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని సంబంధిత అధికారులు వెల్లడించారు.