17-05-2024 01:35:20 AM
దొడ్డు వడ్లకూ రూ.500 అ‘ధనం’ ఇవ్వాల్సిందే..
రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణుల ధర్నాలు, రాస్తారోకోలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ‘గులాబీ’ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ధాన్యం రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. ‘సన్న రకం వడ్లకే కాదు దొడ్డు రకం ధాన్యానికీ క్వింటాకు రూ.500 చొప్పున రైతులకు బోనస్ ఇవ్వాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి’ అనే డిమాండ్‌తో రైతులతో కలిసి రాస్తారోకోలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్న ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తానని మోసం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో 90శాతం మంది రైతులు దొడ్డు రకాలనే పండిస్తారని, ఆ విషయం తెలిసి కూడా రాష్ట్రప్రభుత్వం ఎలా ఇప్పుడు మాట దాటవేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు మొదలయ్యాయని ధ్వజమెత్తారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయన్నారు.
రైతుల సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతుల నుంచి ధాన్యం సేకరించిన 72 గంటల్లో బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము జమయ్యేదని, ప్రస్తుతం సొమ్ము ఆలస్యంగా జమ అవుతుందన్నారు. రైతులకు వెంటనే రైతుబంధు తరహాలో ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు.
జిల్లాల్లో నిరసనలు ఇలా..
మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, నర్సాపూర్‌లో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి,కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, జగిత్యాల జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, హుస్నాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, నారాయణఖేడ్‌లో మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి, కామారెడ్డి జిల్లాకేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మున్సిపల్ చైర్మన్లు, ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, సంగారెడి జిల్లా ఆందోల్‌లో మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.
నిరసనలకు మాజీ ఎమ్మెల్యేలు దూరం
మహబూబ్‌నగర్, మే 16 (విజయక్రాంతి): ధాన్యం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలంటూ రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణులు రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్ల పై బైఠాయించి రాస్తారోకోలు నిర్వహించా రు. కానీ ఈ నిరసన కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డుమ్మా కొట్టారు. వ్యక్తిగత కారణాలతోనే వారు ధర్నాలకు హాజరుకాలేదని ప్రచారం జరుగుతుంటే, మరోవైపు గైర్హాజరు కాకపోవడంపై ఇంకేదైనా కారణం ఉంటుందా? అనే కోణం లో కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.