12-02-2025 12:17:34 AM
నిజామాబాద్, ఫిబ్రవరి 11 : (విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమక్షంలో నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీ.సీ హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు.
ఈ ప్రక్రియను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లలోని ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.
స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు. జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్ స్టాఫ్ కలుపుకుని 6064 ప్రిసైడింగ్ అధికారులు, 8160 మంది ఓ.పీ.ఓ ల ర్యాండమైజేషన్ జరిపారు.
మాస్టర్ ట్రైనర్స్ చే వీరికి పోలింగ్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో అదనపు కలెక్టర్ అంకిత్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, డీపీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.