calender_icon.png 31 March, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిలువ నీడ కరువైనా.. నిలువెల్లా దోపిడీ!

22-03-2025 01:02:39 AM

ధనార్జనే ధ్యేయంగా ప్రైవేటు ఆసుపత్రులు

వచ్చీరాని వైద్యంతో రోగులకు కుచ్చుటోపీ

 అవసరం లేకున్నా అడ్డగోలు టెస్టులు

 ఓపీ పేరుతో అడ్డగోలు వసూళ్లు

 తనిఖీలు చేపట్టని వైద్యారోగ్య శాఖ

నాగర్ కర్నూల్ మర్చి 21 (విజయక్రాంతి) సేవా భావంతో పని చేయాల్సిన వైద్యు లు వైద్యం పేరుతో రోగులనుంచి అడ్డగోలు డబ్బులు దండుకోవడం కోసమే ప్రైవేట్ ఆసుపత్రులను నెలకొల్పుతున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు నిలుచోడం కోసం కనీసం నీడ లేకపోయినా వసతులు కల్పిస్తున్నట్లు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడు తున్నారు. కన్సల్టెన్సీ, ఓపి పేరుతో ఒక్కో రోగి నుంచి సుమారు 250 నుండి 300 వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. కనీసం రోగి సమస్యను సరిగ్గా వినకుండానే అడ్డగోలు టెస్టులు చేయిస్తూ టెస్టుల పేరుతో కమిషన్లు కూడా నొక్కేస్తున్న పరిస్థితి దాపురించింది.

రక్త మూత్ర పరీక్షలతో పాటు ఎక్స్రే, ఈసీజీ ఇతర టెస్టులు రాసి చివరికి ఏమీ లేదంటూ పది రోజులకు సరిపడా అదనపు మందులను బలవంతంగా మింగిస్తు న్నారు. ఫలితంగా రోగుల జేబులకు చిల్లులు పడటంతో పాటు అదనంగా సైడ్ ఎఫెకట్స్ కూడా పోనీ తెచ్చుకుంటున్న పరిస్థితి. ఇక ఆర్.ఎం.పి పి.ఎం.పి వైద్యుల పరిస్థితి చెప్పనక్కర్లేదు కనీసం రోగి వయస్సు, బరువుతో సంబంధం లేకుండా అడ్డగోలుగా వ్యాధి నిరోధక (యాంటిబయాటిక్) మందులను వాడుతూ రోగుల ప్రాణాలను బలికొంటున్న పరిస్థితి ఏర్పడుతోందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రథమ చికిత్సకే పరిమితం కావాల్సిన వారు ఎంబిబిఎస్ పేర్లు తగిలించి కార్పొరేట్ స్థాయిలో వచ్చిరాని వైద్యం చేస్తూ రోగులకు కుచ్చు టోపీ పెడుతున్నారని ఆరోపణ లున్నాయి. మరికొందరు గ్లూకో జ్ బాటిల్ ఎక్కించడం, ఫిష్టిల్ల, ఇతర ఆపరేషన్లతో పాటు బ్రూణ హత్యలకు కూడా పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినా సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంటి ముట్టనట్టు వ్యవహరించడం తో ఆర్‌ఎంపి పి.ఎం.పిలతో పాటు ప్రైవేటు ఆసు పత్రి నిర్వహకులు కూడా ఇష్టారీతిగా రోగుల నుండి డబ్బులు దండుకుంటున్నాయని విమర్శలు ఉన్నాయి. 

అనుమతులు గోరంతే...! 

జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్ కర్నూల్ పట్టణ పరిసర ప్రాంతా ల్లో వైద్యం పేరుతో సుమారు 162 ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలిసాయి. ఆర్తో, డెంటల్, డెర్మటాలజిస్టులు, ఈఎన్టి, న్యూరో, గైనకాలజిస్టులు, చిన్న పిల్లల వైద్య నిపుణులతో భారీ స్థాయిలో ఆసుపత్రులు నెలకొన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ నుండి అనుమతులు పొందే క్రమంలో తక్కువ బెడ్లు అనుమతులు పొంది పరిమితికి మించి బెడ్లు గదులను ఏర్పాటు చేసుకొని బెడ్ ఛార్జ్, గది అద్దె పేరుతో రోగుల నుండి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

వైద్యం చేసే గదులతో పాటు ఇన్ పేషెంట్ గదులు ఔట్ పేషంట్ గదులు కూడా ఇరుకు ఇరుకుగా రోగులకు ఇబ్బందికరంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆర్.ఎం.పి పి.ఎం.పి క్లినిక్ లో అనుమతులు లేకుండానే అడ్డగోలుగా యంత్రాలను ఏర్పా టు చేసుకు న్నారు. కనీసం కుర్చీలు వెంటిలేటర్ ఫ్యాన్ సౌకర్యాలతోపాటు తాగడానికి నీరు నిలుచోడానికి నీడ కూడా సక్రమంగా లేని ఆసు పత్రులు కోకొల్లలుగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లిన రోగులను ఇతర ప్రైవేటు సిబ్బం ది ఆధారంగా తమ ఆసుపత్రులకుమళ్లీస్తున్నారు.

మరికొందరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులే ప్రత్యేకించి ప్రైవేటు క్లినిక్లు ఏర్పాటు చేసుకొని రోగులందరినీ అక్కడికి రప్పించుకొని వారి నుండి డబ్బులు దండు కుంటు న్నారని ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని ఆసుపత్రిలో కన్సల్టెన్సీ పేరుతో హైద రాబాద్ నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి వైద్యులను రపిస్తున్నామని రంగురంగుల కరపత్రాలు మైకుల ద్వారా ప్రచారం చేసుకొని తీరా రోగులు ఆసుపత్రులకు వచ్చాక టెస్టుల పేరుతో అడ్డగోలుగా దండుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. జిల్లా పాత కలెక్టరేట్ కార్యాలయానికి ఆనుకొని ఉన్న ఆర్తో ఆసుపత్రికి పై అంతస్తులో అనుమతులివ్వడం విశేషం.

 తనిఖీలు నిర్వహించి చర్యలు చేపడతాం...!

ప్రస్తుతం ఎస్‌ఎల్బీసీ సొరంగం వద్ద సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాం. సిబ్బంది కొరత కారణంగా తనిఖీలు ఆలస్యం జరిగింది. జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులన్నీ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిందే. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఆర్.ఎం.పి, పి.ఎం.పిలు ఎంబిబిఎస్ అనే పేర్లు తగిలిస్తే చర్యలు తప్పవు. ప్రైవేటు ఆసుపత్రులోనూ డబ్బు సంపాదనే లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. 

స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని, నాగర్ కర్నూలు జిల్లా.