వైద్యుల హాజరును నిరంతరం పర్యవేక్షించాలని డీఎంహెచ్ఓకు ఆదేశం
నిజామాబాద్, (విజయక్రాంతి): వైద్యారోగ్య శాఖ పనితీరును మరింతగా పటిష్టపర్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. మోపాల్ మండలం ముదక్ పల్లిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను, ఔషధాలు నిలువ ఉంచిన స్టోర్ రూమ్, రోగుల ఇన్ పేషంట్ వార్డు, ల్యాబ్ తదితర వాటిని సందర్శించి, రిజిస్టర్లను పరిశీలించారు.
వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీయగా, పలువురు అందుబాటులో లేకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముదక్ పల్లి పీ.హెచ్.సీ పరిధిలో డెంగ్యూ కేసులు నమోదవుతుండడాన్ని గమనించి, అందుకు గల కారణాలు ఏమిటని వైద్య సిబ్బందిని ఆరా తీశారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా వ్యాప్తంగా గల అన్ని పీ.హెచ్.సీలు, ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది అందరూ సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని, ప్రతిరోజూ ఉదయం వేళలోనే అటెండెన్స్ ను పర్యవేక్షించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖలో స్పష్టమైన మార్పు కనిపించాలని, క్షేత్ర స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును గాడిలో పెట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.
అన్ని ఆసుపత్రులు, పీ.హెచ్.సీల వైద్యులతో సమీక్ష నిర్వహించి, ప్రజలకు అందుబాటులో ఉంటూ అంకిత భావంతో వైద్యసేవలు అందించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. ఎక్కడైనా పీ.హెచ్.సీలో వైద్యాధికారి సెలవులో ఉంటే, ఇతర ఆసుపత్రుల నుండి ప్రత్యామ్నాయంగా వైద్యులను సర్దుబాటు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యానికి తావుండకూడదని అన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు. పాము కాటు, కుక్కకాటు మందులతో పాటు అన్ని అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని హితవు పలికారు.