calender_icon.png 15 March, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదం ఎక్కడ పుట్టిందో చెప్పనవసరం లేదు

14-03-2025 11:50:24 PM

పాకిస్థాన్‌పై ధ్వజమెత్తిన భారత్

పాక్ విదేశాంగ ప్రతినిధి ఆరోపణలపై రణ్‌ధీర్ మండిపాటు

న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి మూలం ఎక్కడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మండిపడ్డారు. భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందంటూ పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి షఫ్‌ఖత్ అలీఖాన్ అక్కసు వెళ్లగక్కారు. భారత మీడియా బీఎల్‌ఏ చర్యను కీర్తిస్తోందని.. అధికారికంగా కాకపోయినా ఒక విధంగా ఆ దేశ విధానాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. అయితే పాక్ చేసిన ఆరోపణలను రణ్‌ధీర్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ లాంటి దేశం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతరుల వైపు వేలు చూపించే బదులు తమ అంతర్గత సమస్యలపై దృష్టి సారిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.

ఇక రైలు హైజాక్ వెనుక అఫ్గానిస్థాన్ హస్తం ఉందనేందుకు తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని షఫ్‌ఖత్ చేసిన వ్యాఖ్యలపై ఆఫ్గన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. పాక్ బాధ్యతారహిత వ్యాఖ్యలు వారి దిగజారుడు విధానాలకు నిదర్శనమన్నారు. తమ సమస్యలను పరిష్కరించుకోలేని పాక్ ఇతర దేశాలపై నిందలు వేయడం మానుకుంటే మంచిదని హితవు పలికింది. సుమారు 425 మంది ప్రయాణికులతో క్వెటా నుంచి పెషావర్‌కు వెళుతున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) వేర్పాటువాదులు బోలన్ ప్రాంతంలో మంగళవారం హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు 33 మందిని హతమార్చినట్లు పాకిస్థాన్ సైన్యం పేర్కొంది.