calender_icon.png 15 April, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డేగ కళ్ల నిఘాలో రాణా

13-04-2025 01:08:59 AM

* కొనసాగుతున్న విచారణ

* చీమ చిటుక్కుమన్నా తెలిసేలా ఏర్పాట్లు

* ముంబై దాడుల గురించి దుబాయ్ వ్యక్తికి ముందే తెలుసా?

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న తహవూర్ రాణా (64) విచారణ కొనసాగుతోంది. విచారణ సమయంలో దుబాయ్ వ్యక్తి ఆంశం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ముంబై దాడులకు ముందే రాణా దుబాయ్‌లో ఆ వ్యక్తిని కలిశాడని, దాడుల గురించి అతడికి ముందే తెలుసని భారత అధికారులతో యూఎస్ అధికారులు పేర్కొన్నారు.

దీంతో ఎన్‌ఐఏ ఆ దుబాయ్ వ్యక్తి గురించి ఆరా తీస్తోంది. అంతే కాకుండా ఓ రహస్య సాక్షితో రాణాను కలిపి విచారించేందుకు ఎన్‌ఐఏ అధికారులు సమాయత్తం అవుతున్నట్టు సమాచారం. ముంబై దాడులకు ముందు ఆ వ్యక్తే డేవిడ్ హెడ్లీని ముంబైలో రిసీవ్ చేసుకున్నట్టు పలువురు అధికారులు పేర్కొంటున్నారు. ఆ వ్యక్తి ఇటు రాణాతో పాటు డేవిడ్ హెడ్లీకి కూడా చిన్ననాటి స్నేహితుడని అనుమానిస్తున్నారు. దీంతో అతడి సాక్ష్యం కీలకంగా మారనుందని అధికారుల అభిప్రాయం. 

సాజిద్ మిర్‌తో సంబంధాలు

సాజిద్ మిర్ అనే అంతర్జాతీయ ఉగ్రవాదితో రాణా తరచూ సంప్రదింపులు జరిపే వాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. భారత మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల్లో మిర్ ఒకరు. ముంబై దాడుల్లో మిర్ ప్రధాన వ్యక్తుల్లో ఒకడు. అంతే కాకుండా ముంబై చాబాద్ హౌస్‌లో ఆరుగురు పర్యాటకుల మృతికి కారణం అయ్యాడు. మిర్ గురించిన సమాచారం ఇస్తే 5 మిలియన్ అమెరికన్ డాలర్ల బహుమతి ఇవ్వనున్నట్టు ఇప్పటికే అమెరికా ప్రకటించింది.

2002 ముట్టడి సమయంలో దాడులు చేసిన వారితో మిర్ మాట్లాడిన సంభాషణను భారత్ ఇప్పటికే ఐక్యరాజ్యసమితికి సమర్పించింది. రాణా ఐఎస్‌ఐ కీలక నేత మేజర్ ఇక్బాల్‌ను కూడా కలిసినట్టు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. విచారణను మొత్తం రికార్డు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2011 బ్యాచ్ జార్ఖండ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ డీఐజీ రాయ్ ఈ విచారణ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. రాణాను హైసెక్యూరిటీ నడుమ ఉంచారు. చుట్టూ సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి దృశ్యాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. 

పాక్ ఆర్మీ యూనిఫాం అంటే ఇష్టమట

తహవూర్ రాణాకు పాక్ ఆర్మీ దుస్తులంటే తెగ ఇష్టమట. అందుకోసమే రాణా తన వైద్య విద్య పూర్తయిన వెంట నే పాక్ ఆర్మీలో ఉన్న మెడికల్ కార్ప్స్ లో చేరాడు. తర్వాతి రోజుల్లో ఆ ఉద్యో గం వదిలేసినప్పటికీ లష్కరే తోయిబా ఉగ్రవాదులను, పాక్ ఆర్మీ వ్యక్తులను కలిసినపుడు ఆర్మీ దుస్తులు ధరించేవాడట.