calender_icon.png 31 October, 2024 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కట్టలు తెగుతున్న నిర్లక్ష్యం

21-07-2024 01:00:20 AM

పెద్దవాగు ప్రాజెక్టు మెయింటెనెన్స్‌కు నిధులు లేమి

  1. కనీసం జనరేటర్‌లో ఆయిల్‌కూ డబ్బు ఇవ్వని వైనం
  2. బడ్జెట్ రిలీజ్ చేయని ఆర్థిక శాఖ
  3. అదే దుస్థితిలో కడెం, నిజాంసాగర్‌తోపాటు మరికొన్ని ప్రాజెక్టులు
  4. నిద్ర మేల్కొనని అధికార యంత్రాంగం
  5. ప్రభుత్వాలు మారినా.. పనితీరులో మార్పు రాలేదు!

* పూర్తిగా.. స్పష్టంగా.. నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనపడుతోంది. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు వచ్చిన భారీ వరద కారణంగా ఏకంగా కట్టనే కొట్టుకుపోవడానికి కారణాలను పరిశీలిస్తే.. అధికార యంత్రాంగంలో నిర్లక్ష్యం, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాక మెయింటెనెన్స్‌ను పట్టించుకోకపోవడమే ప్రధాన కారణాలుగా కనపడుతున్నాయి. ఇలా అన్ని విభాగాల్లో పేరుకుపోయిన నిర్లక్ష్యం కారణంగానే పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడి.. వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు, అదేస్థాయిలో పశువులు వరద నీటిలో కొట్టుకుపోవడం.. సుమారు రూ. 10 కోట్లకుపైగా విలువైన మట్టికట్ట కొట్టుకుపోవడానికి కారణమయ్యాయని స్పష్టంగా కనపడుతున్నది.

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): నీటి ప్రాజెక్టులను నిర్మించడం ఒక ఎత్తు అయితే.. వాటిని మెయింటెనెన్స్ చేయడం మరో ఎత్తు. వర్షా కాలంలో ఒక్కసారిగా వచ్చే భారీ వరదలను ముందుగానే ఊహించి.. అందుకు ప్రాజెక్టును సిద్ధంగా చేయడం.. వచ్చే వరదను అంచనా వేసి.. ఆ వరద నీటిని దిగువకు వదిలేలా గేట్లను తెరవడం, ఇతరత్రా మరమ్మత్తులు చేయడం లాంటి పనులన్నీ మెయింటెనెన్స్ కిందకే వస్తాయి.

కానీ పెద్దవాగు ప్రాజెక్టు విషయంలో ఇలా మెయింటెనెన్స్ విషయం లోనే పూర్తి నిర్లక్ష్యం నెలకొన్నట్టుగా నీటిపారుదల శాఖలోనే చర్చిస్తున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీచేయడంకూడా ఇక్కడ గమనార్హం. అయితే మెయింటెనెన్స్‌కు తగినన్ని నిధులు లేకపోవడంతోనే.. అధికారులు కూడా నిస్తేజంగా తయారయ్యారు. వరద ఒక్కసారిగా భారీగా రావడంతో రెండు గేట్లు ఎలాగోలా తెరిచినా.. మూడో గేటు తెరవలేకపోయారని, అందుకు ప్రధానంగా మెయింటెనెన్స్ లేకపోవడం కారణంగా చెబుతున్నారు.

మూడో గేటు తెరిచేందుకు ఉపయోగించే విద్యుత్తు మోటారు కాలిపోవడం, మాన్యువల్‌గా తెరిచే ప్రయత్నం చేసినా.. మెయింటెనెన్స్ లేకపోవడంతో మూడో గేటు మొరాయించింది. పైగా జనరేటర్‌ను ఉపయోగిద్దామంటే.. కనీ సం ఆయిల్‌కు కూడా డబ్బులు లేని దుస్థితి. దీనికి ప్రధాన కారణం..  గడిచిన పదేండ్లుగా ప్రాజెక్టు నిర్వహణకు నిధులు లేకపోవడం, నిధుల కోసం ఆర్థిక శాఖకు ఎన్నిసార్లు ఫైళ్లు పంపించినా.. ఉలుకూ పలుకు లేకపోవడంతో అధికార యంత్రాంగంలోనూ అదే స్థాయి నిర్లక్ష్యం పెరిగిపోయింది. గత ప్రభుత్వంతోపాటు.. కొత్త ప్రభుత్వం కూడా ప్రాజెక్టుల నిర్వహణ నిధులను విడుదల చేయడంపై అంతగా దృష్టి పెట్టలేదు. 

పదేండ్లుగా పేరుకుపోయిన నిర్లక్ష్యం..

వాస్తవానికి పెద్దవాగు ప్రాజెక్టును 40 ఏండ్ల క్రితం అప్పటి అవసరాలమేరకు మొత్తం 16 వేల ఎకరాలకు సాగునీరందించేలా దీనిని నిర్మించారు. అయితే రాష్ట్ర విభజన తరువాత వేలేరుపాడు, కుక్కునూరు మండలాలను ఏపీలోకి చేర్చడంతో ఈ రెండు మండలాల పరిధిలోనే సుమారు 14 వేల ఎకరాల ఆయకట్టు ఏపీ పరిధిలోకి వెళ్ళింది. దీనితో కేవలం ఆశ్వరావుపేట పరిధిలో సుమారు 2300 ఎకరాల ఆయకట్టు మాత్రమే తెలంగాణలో ఉంది. గరిష్టంగా ఆయకట్టు ఏపీలో ఉంటే.. ప్రాజెక్టు మాత్రం తెలంగాణలో ఉండిపోయింది. దీనితో గత ప్రభుత్వం.. మనకెందుకులే అనే నిర్లక్ష్యంతో మెయింటెనెన్స్‌కు నిధులు విడుదల చేయడంపై దృష్టి సారించలేదు. కొత్త ప్రభుత్వంలో కూడా సమన్వయలోపం కారణంగా ఈయేడు కూడా ప్రాజెక్టు నిర్వహణకు నిధులు విడుదల చేయనట్టు సమాచారం. 

వాస్తవానికి ప్రతి వర్షాకాలం ప్రారంభానికి ముందే మెయింటెనెన్స్ నిధులతో గేట్లు, మట్టి కట్ట పటిష్టానికి చర్యలు, కాలువల మరమ్మత్తులు ఇలా నిర్వహణ పనులన్నీ పూర్తిచేసి వచ్చే వరదకు అనుగుణంగా నిర్వహణ చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే గత పదేండ్లుగా ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి నిధులు లేకపోవడంతో.. నీటిపారుదల శాఖ అధికారులు ఫైళ్లు పంపించడం.. ఆర్థిక శాఖ అడ్డుకట్ట వేయడంతోనే సరిపోతోంది. అటు ఆర్థిక శాఖ ప్రాజెక్టుల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్‌కు నిధులు విడుదల చేయకపోవడం, ఇటు నిధులు లేకపోవడంతో నీటిపారుదల శాఖ అధికారుల్లో ఏమీ చేయలేక నిస్తేజంగా ఉండిపోవడం కారణంగా పెద్దవాగు ప్రాజెక్టుకు శుక్రవారం భారీ గండి పడిందనే విమర్శలు బలంగా వినపడుతున్నాయి. 2004 నుంచి ఇప్పటి వరకు అంటే 20 సంవత్సరాల్లో కేవలం రూ. 3 కోట్లు మాత్రమే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్‌కు ఖర్చు పెట్టారనేది అనధికార వర్గాల నుంచి వినపడుతోంది. అంటే నిధుల లేమి ఎంత ఇబ్బందికరంగా మారిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 

రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి..

నిజానికి పెద్దవాగు ప్రాజెక్టు వద్దే ఇలాంటి పరిస్థితి నెలకొంది అనుకుంటే పొరపాటే.. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులను ఈ నిధుల లేమి, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం అనేది వేధిస్తోంది. గడిచిన రెండు మూడేండ్లలో కడెం ప్రాజెక్టు మీది నుంచి వరద నీరు ప్రవహించడానికి కూడా ఈ నిధుల లేమి, నిర్లక్ష్యమే కారణం. కడెం, నిజాంసాగర్ లాంటి ప్రాజెక్టులతోపాటు మరికొన్ని ప్రాజెక్టులకుకూడా ఈ నిధులు లేక, నిర్లక్ష్యం కారణంగా మెయింటెనెన్స్‌లో లోపాటు బయటపడుతున్నాయి.

వర్షాకాలం ప్రారంభం అయ్యేనాటికే అన్నీ సరిచూసుకోవాల్సిన బాధ్యత నీటిపారుదల శాఖపై ఉండగా.. ప్రాజెక్టుల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్‌కు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సిన బాధ్యత ఆర్థిక శాఖపై ఉంది. కానీ గడిచిన పదేండ్లుగా ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యానికే పెద్దపీట వేస్తున్నట్టుగా కనపడుతోంది. గత ప్రభుత్వం పెంచి పోషించిన నిర్లక్ష్యం.. అలాగే కొనసాగుతోంది. అదికాస్త.. ముదిరి పెద్దవాగు ప్రాజెక్టు గండికి దారి తీసిందనే వాదన బలంగా వినపడుతోంది.

కడెం ప్రాజెక్టు విషయంలో రెండు సంవత్సరాలుగా ఎలక్ట్రికల్ కేబుళ్లు, ట్రాన్స్‌ఫార్మర్ ఎస్టిమేట్ విషయంలో వర్షాలు పడే వరకు ఆగి.. టెండర్లు పిలిచి చేతులు దులుపుకున్నారు. ఇదే వర్షాకాలం ప్రారంభం ముందే ఇవన్నీ ముగించాలి. కానీ అటు బడ్జెట్ లేక.. ఇటు అధికారుల్లో నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టులకు ఎప్పుడేం జరుగుతుందో అనే భయం వెంటాడుతూనే ఉంది. 

అటకెక్కిన ఫస్ట్ కం ఫస్ట్ పేమెంట్ పద్ధతి..

ప్రాజెక్టుల నిర్మాణమైనా.. ఆపరేషన్స్, మెయింటెనెన్స్ అయినా.. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకే ఆర్థిక శాఖలో పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు ఉండనే ఉన్నాయి. చిన్న చిన్న పనులు చేసే కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపును ఆర్థిక శాఖలోని అధికారులు అసలే పట్టించుకోరు అని కాంట్రాక్టర్లు నెత్తినోరు కొట్టు కుంటారు. వాస్తవానికి రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులకు సం బంధించి ఆపరేషన్స్, అండ్ మెయింటెనెన్స్ విషయంలో ఫస్ట్ కం ఫస్ట్ పేమెంట్ పద్ధతి అమలులో ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ పద్ధతికి మంగళం పలికారు. దీనితో పైరవీతో వచ్చే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకే బిల్లుల చెల్లింపులు జరిగాయనే ఆరోపణలు బలంగా వచ్చాయి. ఫస్ట్ కం ఫస్ట్ పేమెంట్ పద్ధతిని తుంగలో తొక్కి.. ఆర్థిక శాఖ అధికారుల వద్ద పలుకుబడి ఉన్నవారికే బిల్లులను చెల్లించేవారు.

సదరు శాఖ ప్రిన్పిపల్ సెక్రెటరీని కలవాలంటే సాధారణ కాంట్రా క్టర్లకు, అధికారులకు సాధ్యం కానిపని. పెద్దయెత్తున సెక్యూరిటీనికూడా గత ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. దీనితో ఆర్థిక శాఖ అధికారులను కలవడం అనేది కనాకష్టంగా మారింది. ఇలా బిల్లుల చెల్లిం పులో.. అటు ప్రాజెక్టుల నుంచి వచ్చే ఆపరేషన్స్, మెయిం టెనెన్స్ ఫైళ్లను ఆర్థికశాఖ మోకాలడ్డటంతో.. ప్రాజెక్టు నిర్వహణ అటకెక్కింది. నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఈ పరిస్థి తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో వైఫల్యం చెందారు.  ఫలితంగా అనేక ప్రాజెక్టుల నిర్వహణకు నిధు లు లేక వరదలకు అతలాకుతలం అవుతున్నాయి. అందులో భాగంగానే పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడింది. మరికొన్ని ప్రాజెక్టులకు ఇలాంటి ప్రమాదే పొంచి ఉంది. ఇకనైనా అటు ఆర్థిక శాఖ.. ఇటు నీటిపారుదల శాఖతోపాటు.. ప్రభుత్వం పెద్దలు కూడా దీనిపై దృష్టి సారిస్తే.. మరిన్ని ప్ర మాదాలు జరక్కుండా జాగ్రత్త పడినవారవుతారు..!