ఖమ్మం,(విజయక్రాంతి): ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ ప్రీయంక గాంధీ వాద్రా(Congress MP Priyanka Gandhi Vadra)పై అక్కడి బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. బీజేపీ నేత వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం జిలా కాంగ్రెస్ కార్యాలయం నుంచి పాతబస్టాండ్ సెంటర్ వరకు ప్రదర్శనగా వెళ్ళి బీజేపీ ఢిలీ అసెంబ్లీ అభ్యర్ధి రమేశ్ బిధూరి దిష్టి బొమ్మ(Ramesh Bidhuri Effigy Burnt)ను దహనం చేసి,నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ చర్యలను ఎండగడుతూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
మహిళలకు క్షమాపణ చెప్పాలి
ఈ సందర్బంగా పలువురు వక్తలు మాట్లాడుతూ బీజేపీ నాయకులకు మహిళలంటే చిన్న చూపు కనుకనే ప్రియంకాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటిని వెంటనే ఉపసంహరించుకుని,క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ అభ్యర్ధికి ఇచ్చిన టిక్కెట్‌ను రద్దు చేయాలని కోరారు. భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడడంతో పాటు మహిళలకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే దేశ వ్యాప్తంగా మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టి, బీజేపీ దుందుడుకు చర్యలను ఎండగడతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు దొబ్బల సౌజన్య, నగర మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్ ముక్తార్, ఓబీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, ఉపాధ్యక్షులు గజ్జి సూర్యనారాయణ, కిసాన్ కాంగ్రెస్ నాయకులు మొక్కా శేఖర్‌గౌడ్, ఎస్సీ సెల్ నాయకులు బొడ్డు బొందయ్య, సేవాదళ్ నాయకులు సయ్యద్ గౌస్, కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, పల్లెబోయిన భారతి, చంద్రం, కన్నం వైష్ణవి ప్రసన్న, గజ్జెల్లి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.