10-04-2025 02:41:41 PM
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా(Yoga Guru Baba Ramdev) సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీలపై సంచలన ఆరోపణలు చేస్తూ వారు "షర్బత్ జిహాద్"(Sharbat Jihad)లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. పతంజలి గ్రూప్ ప్రారంభించిన గులాబీ షర్బత్ కోసం ఇటీవల విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలో రాందేవ్ బాబా ఈ కంపెనీలు కూల్ డ్రింక్స్ ముసుగులో విషాన్ని అమ్ముతున్నాయని, ఆ డబ్బును మసీదులు, మదర్సాలు నిర్మించడానికి ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. "సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీలు కూల్ డ్రింక్స్ లేబుల్ కింద మార్కెట్లో విషాన్ని అమ్ముతున్నాయి" అని రాందేవ్ బాబా కీలక ఆరోపణలు చేశారు. "ఇది షర్బత్ జిహాద్. మీరు తాగే ప్రతి కూల్ డ్రింక్ తో విషం మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. మీరు ఖర్చు చేసే డబ్బు మసీదులు, మదర్సాల నిర్మాణానికి వెళుతుంది" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శీతల పానీయాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరుతూ పతంజలి గులాబీ షర్బత్(Patanjali Gulab Sharbat), ఇతర పానీయాలను సురక్షితమైన ప్రత్యామ్నాయంగా రాందేవ్ బాబా ప్రచారం చేశారు. "కూల్ డ్రింక్స్ పేరుతో విక్రయించే విషపూరిత పదార్థాల నుండి మీ కుటుంబాన్ని రక్షించండి. ఇవి మారువేషంలో టాయిలెట్ క్లీనర్లు తప్ప మరేమీ కాదు" అని ఆయన వీడియోలో పేర్కొన్నారు. "పతంజలి పానీయాలు(Patanjali Drinks) మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. మీరు ఖర్చు చేసే డబ్బు గురుకులాలు, పతంజలి విశ్వవిద్యాలయ నిర్మాణానికి తోడ్పడుతుంది" అని పేర్కొంటూ, పతంజలి షర్బత్‌లు, జ్యూస్‌లను మాత్రమే ఇంటికి తీసుకురావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పతంజలి గులాబీ షర్బత్ ప్రచార ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే స్వభావం, మతపరమైన చిక్కుల కారణంగా అందరీ దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.