18-04-2025 01:03:09 AM
నూతన భవనానికి నిధులు మంజూరు చేయాలి
రామాయంపేట, ఏప్రిల్ 17 :నాలుగు దశాబ్ధాల క్రితం రామాయంపేటలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత ఈ ప్రాంత జనాభా సుమారు ఒక లక్ష మందికి పైగా ఉంటుంది. 60 గ్రామాల ప్రజలు ఇక్కడకి విద్య, వైద్యం, ప్రభుత్వ కార్యాలయల పనుల కోసం రావటం జరుగుతుంది. రామాయంపేట మండల ప్రధాన కేంద్రంగా ఉండే లైబ్రరీకి చుట్టు పక్కన ఉన్న మండలాల నుండి నిరుద్యోగ యువతీ, యువకులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, స్కూల్, కళాశాలల విద్యార్థులకు ఉపయోగం ఉంటుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే పోటి పరీక్షలకు ప్రయత్నించే నిరుద్యోగ యువతి యువకులకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం లైబ్రరీలో ఎలాంటి వసతులు లేవు. సిబ్బంది కూడా ఇంచార్జిగా ఉండడంతో ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో అర్థంకాని పరిస్థితి. దీంతో లైబ్రరీకి ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుందని పలువురు నిరుద్యోగులు వాపోతున్నారు. పోటీ పరీక్షలకు చదువుకోడానికి కామారెడ్డి, మెదక్ వెళ్తున్నారు.
ఇటీవల అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ సుహాసినిరెడ్డి పర్యటించినా పరిస్థితి అలాగే ఉంది. అధునాతన లైబ్రరీ ఏర్పాటు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద, మధ్య తరగతి యువతీ యువకుల కుటుంబాలకు మేలు జరుగుతుంది. జిల్లా కలెక్టర్, ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని స్ధానిక నిరుద్యోగ యువకులుకోరుతున్నారు.