15-02-2025 01:44:38 AM
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
రాజేంద్రనగర్ (విజయక్రాంతి), ఫిబ్రవరి 14: రామానుజచార్యులు సమాజంలో సమానత్వం కోసం ఎంతో కృషి చేశారని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం శంషాబాద్ మండల పరిధిలోని ముచింతల్ లో రామానుజ విజ్ఞాన వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామానుజులు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, కుల వ్యవస్థను వ్యతిరేకించారని అన్నారు. అందరిలో సమానత్వం తీసుకొచ్చేందుకు పాటుపడాలని తెలిపారు. రామానుజుల గురువుల్లో అబ్రహ్మాణులు కూడా ఉన్నారని చెప్పారు. ఆయన తన 120 ఏళ్ల జీవితంలో ఎన్నో ప్రాంతాలు తిరిగారని, దళితులకు ఆలయ ప్రవేశం చేయించారని కొనియాడారు.
దళితుడిని భుజాలపైకి ఎక్కించుకుని ఆలయంలోకి తీసుకెళ్లారని, దాన్నే మునివాహన సేవ అంటున్నారని చెప్పారు. మతం పూజగదిలోనే ఉండాలి, కులం గడప దగ్గరే ఆగిపోవాలి, గడప దాటాక అందరం భారతీయులం అని గుర్తించాలని లక్ష్మీనారాయణ విద్యార్థులకు సూచించారు.