calender_icon.png 25 February, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘రామం రాఘవం’ సినిమా ఎలా ఉందంటే..

20-02-2025 07:30:50 PM

చిత్రం: రామం రాఘవం

నటీనటులు: సముద్రఖని, ధన్‌రాజ్, హరీష్ ఉత్తమన్, ప్రమోదిని, పృథ్వీరాజ్, సునీల్, శ్రీనివాస్ రెడ్డి

దర్శకత్వం: ధన్‌రాజ్

నిర్మాత: పృథ్వీ పోలవరపు

విడుదల తేదీ: ఫిబ్రవరి 21, 2025

కమెడియన్ ధన్‌రాజ్ చాలా చిత్రాలు చేశాడు.. తన నటనకు మంచి మార్కులు వేయించుకున్నాడు. అలాగే పలు కామెడీ షోలలోనూ మెప్పించాడు. అలాంటి ధన్‌రాజ్ తొలిసారిగా ఒక చిత్రానికి దర్శకుడిగా మారాడు. అలాగే ప్రధాన పాత్రలోనూ నటించాడు. అదే ‘రామం రాఘవం’. ఈ సినిమాలో తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ గట్టిగానే చేయడంతో అంచనాలు బాగానే పెరిగాయి. కమెడియన్‌గా మెప్పించిన ధన్‌రాజ్ దర్శకుడిగా మెప్పించాడా? తన నటనకు ఎన్ని మార్కులు వేయించుకున్నాడు? చూద్దాం. 

కథేంటంటే.. 

దశరథ రామం (సముద్ర ఖని) సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తూ నీతి నిజాయితీలే ప్రాణంగా జీవిస్తుంటాడు. అతని కుమారుడే రాఘవ (ధన్‌రాజ్). రామంకు కొడుకంటే ప్రాణం. కొడుకును డాక్టర్‌ను చేయాలని తాపత్రయ పడతాడు. కానీ పండిత పుత్ర పరమ శుంఠః అన్న చందంగా రాఘవ అన్ని రకాల అవలక్షణాలను అలవరుచుకుంటాడు. మద్యం సేవిస్తూ, సిగిరెట్లు తాగుతూ జులాయిగా తిరుగుతుంటాడు. ఈజీ మనీ కోసం రాఘవ చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టి అతడిని చిక్కుల్లో పడేస్తాయి. ఓ సారి డబ్బు కోసం తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో తండ్రే పోలీసులకు పట్టిస్తాడు. ఆ తరువాత రాఘవ అనూహ్య నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయమేంటి? ఆ నిర్ణయంతో రామంకి ఎలాంటి పరిస్థితి వచ్చింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

దాదాపుగా సినిమా మొత్తం ప్రధాన పాత్రలైన రామం, రాఘవం చుట్టే తిరుగుతుంది. అమితంగా ప్రేమించే తండ్రి.. అంతలా తండ్రిని ద్వేషించే కొడుకు. ఫస్ట్ హాఫ్ మొత్తం రామం నీతి నిజాయితీలు, రాఘవ చేసే తప్పులను హైలైట్ చేస్తూ కథ సాగుతుంది. అయినా సరే.. సినిమా ఎక్కడా బోర్ అనిపించదు. ఆసక్తికరంగానే సాగుతుంది. సెకండ్ హాఫ్‌లో అసలు కథ ప్రారంభమవుతుంది. తన తప్పులను సవరించాలనుకునే తండ్రి విషయంలో రాఘవ ఒక నిర్ణయం తీసుకోవడం.. ఒకానొక తరుణంలో రాఘవ రియలైజ్ అయ్యాడేమో అనిపిస్తుంది కానీ అవడు. సినిమాకు ఇదొక మంచి ట్విస్ట్ అనే చెప్పాలి.

ఆ తరువాత రాఘవ తీసుకున్న నిర్ణయం తెలుసుకున్న రామం చేసిన పని ప్రతి ఒక్కరికీ కంటతడి పెట్టిస్తుంది. చివరకు కథ ఎలాంటి మలుపు తీసుకుందనేది ఆసక్తికరంగానూ.. హృదయాలను మెలితిప్పేదిగానూ ఉంటుంది. పెడదారి పడుతున్న నేటి చాలా మంది యువకులకు ఇది సరిగ్గా సరిపోతుంది. తండ్రి బాధను అర్థం చేసుకోకపోవడం, ఈజీ మనీ కోసం తాపత్రయే పడే యువతను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా. 

ఎవరెలా చేశారంటే..

కొడుకు కోసం తాపత్రయ పడే తండ్రిగా సముద్ర ఖని అద్భుతంగా నటించారు. అలాగే ఏమాత్రం బాధ్యత తెలియని కొడుకుగా ధన్‌రాజ్ అద్భుతంగా నటించాడు. అలాగే దర్శకుడిగానూ కథను నడిపించిన తీరు కూడా చాలా బాగుంది. ఎక్కడా అనవసరపు అంశాల జోలికి వెళ్లలేదు. సినిమాకు ఏది ముఖ్యమో దానిని మాత్రమే తెరపై ఆవిష్కరించాడు. తల్లి పాత్రలో ప్రమోదిని జీవించారు. సత్య తనదైన స్టుల్‌లో హాస్యం పండించాడు. ఈ మధ్య కాలంలో హాస్యంలో డబుల్ మీనింగ్స్ ఎక్కువవుతున్నాయి. కానీ ఈ సినిమాలో అలాంటి వాటికి తావివ్వలేదు. సునీల్, హరీష్ ఉత్తమ్, శ్రీనివాసరెడ్డి, పృథ్వీరాజ్ తదితరులు తమ పరిధి మేర చక్కగా నటించారు.