08-04-2025 12:22:17 AM
భద్రాచలం, ఏప్రిల్ 7: దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల సీతారాముల ఆలయంలో సోమవారం రాములవారి పట్టాభిషేకం కన్నులపండువగా జరిగింది. దేవస్థానం సన్నిధఙలోని మిధిలా ప్రాంగణంలో నిర్వహించిన శ్రీరామ పట్టాభిషేకానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్చకుల వేద మంత్రోచ్ఛరణతో మిథిలా ప్రాంగణం పులకించింది.
గవర్నర్ జిష్ణుదేవవర్మ ఈ మహోత్సవానికి హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు రామాలయంలో గవర్నర్ స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత రామాలయ భద్రుడి మండపంలో అర్చక స్వాములు స్వామివారి పాదుకలకు అభిషేకం చేశారు. రాజలాంఛనాలతో పవిత్ర పావన గౌతమీ నదీ తీరం నుంచి తీర్థములు తెచ్చారు. .
భాజా భజంత్రీల సందడి, సన్నాయి మేళాలు, భక్తుల కోలాటంతో సీతారామచంద్రస్వామి వారిని ఊరేగింపుగా మిధిలా ప్రాంగణానికి తీసుకొచ్చారు. శిల్పకళా శోభిత కళ్యాణ మండపంపై స్వామివారు ఆశీనులయ్యారు. అర్చక స్వామలు తొలుత విశ్వక్‌సేన ఆరాధన, పుణ్యాహా వాచనం నిర్వహించి, స్వామివారికి పాదుకలు, రాజదండం, రాజముద్రి క, స్వర్ణకిరీటం, ఖడ్గం, రత్నాభరణం ధరింప చేసి పట్టాభిషేక పారాయణం గావించారు.
పుష్కర నది జలాలతో మహాకుంభ తీర్థప్రొక్షణ గావించారు. ఈ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, ఐటీడీఏ పీవో రాహూల్, దేవదాయ ధర్మాదాయ కమిషనర్ శ్రీధర్, ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.