calender_icon.png 30 October, 2024 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామగుండంలో పవర్ ప్లాంటు

01-09-2024 01:54:45 AM

  1. 8౦౦ మెగావాట్ల భారీ ప్లాంటు నిర్మిస్తాం 
  2. పాత ప్లాంటు స్థానంలోనే కొత్త ప్రాజెక్టు

ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు 

నెల రోజుల్లో రామగుండంలో రూరల్ టెక్నాలజీ సెంటర్

కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని రైతుల వద్దకు వెళ్తారు?

రామగుండం పర్యటనలో డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రుణమాఫీ చేసి తీరుతాం: శ్రీధర్‌బాబు

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కీలకం: పొన్నం

పెద్దపల్లి/రామగుండం, ఆగస్టు ౩1 (విజయక్రాంతి): రామగుండం పట్టణంలో 62.5 మెగావాట్ల పాత విద్యుత్ ప్లాంటు స్థానంలో సింగరేణి, జెన్‌కో జాయింట్ వెంచర్‌లో 800 మెగావాట్ల ప్లాంటును నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. అందుకు భూసేకరణ టెండర్లు త్వరలోనే పిలుస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పట్టుబట్టి అడిగేవారని తెలిపారు.

ఈ భారీ ప్రాజెక్టు నిర్మిస్తే వ్యాపార పరంగా, జనాభా పరంగా రామగుండం ఎంతో అభివృద్ధి చెందుతుందని, అందుకే 800 మెగావాట్ల థర్మల్ కేంద్రం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌తో కలిసి శనివారం రామగుండం వచ్చిన భట్టికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రామగుండంలో మూతపడిన 62.5 మెగావాట్ల ప్రాజెక్టు స్థలంలో 800 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు.

సెక్టార్ వద్ద రూ.3 కోట్లతో నిర్మించిన నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించారు. రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో టీయూఎఫ్‌ఐడీసీ కింద రూ.55 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు గోదావరిఖని చౌరస్తాలో శంకుస్థాపనలు చేశారు. అక్క డ జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ 800 మెగావాట్ల పవర్ ప్లాంట్‌కు అవసరమైన భూమి, ఇతర సౌకర్యాల కల్పనకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించి ఎంత తొందరగా ప్రతిపాదనలు పంపితే అంత తొందరగా పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. 1971లో ఏర్పాటు చేసిన రామగుండం జెన్ కో కేంద్రం 50 ఏళ్ల పాటు సేవలు అందించిందని, సాంకేతిక కారణాలతో దానిని మూసివేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో స్థానిక ప్రజలకు ఉన్న భావోద్వేగాలను గుర్తించి ఇక్కడే భారీ పవర్ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించినట్టు చెప్పారు. 

కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని వస్తాడు

ఇన్నాళ్లు ఫాంహౌజ్‌కు పరిమితమైన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు తానేదో ఉద్దరించేందుకు రైతుల వద్దకు వస్తానని చెప్తున్నారనీ, రైతుల వద్దకు ఏ మొహం పెట్టుకొని వస్తారని భట్టి విమర్శించారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు లక్ష రుణం మాఫీ చేయడా నికే ఐదేళ్లు సమయం తీసుకున్నారని, ఇప్పుడు అధికారం కోల్పోయాక రైతులు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సంపదతో కొడుకు, కూతురు పేర్ల మీద విదేశాల్లో సంపదలు దాచుకొని ఇప్పుడు కపట ప్రేమ వొలకబోస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు మంచి చేస్తే బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు ఎందుకు దూరం పెడుతారని ప్రశ్నించారు.

సింగరేణి కార్మికులకు ఇళ్ల పట్టాలు

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్‌లో చాలా తపన చూస్తున్నానని భట్టి విక్రమార్క ప్రశంసించారు. ఆయన తనవద్దకు వచ్చినప్పుడల్లా రామగుండంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మించాలని పట్టుబట్టేవారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రామగుండంలో 20వేల మంది సింగరేణి కార్మిక కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామనీ, అప్పుడు మిగిలిన మరో 5 వేల కుటుంబాలకు గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని చెప్పారు.

తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందున మిగిలిన కుటుంబాలతోపాటు జెన్‌కో ప్రాంత కుటుంబాలకు కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మక్కాన్ సింగ్ కోరారని వెల్లడించారు. త్వరలోనే వాటిని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. పాలకుర్తి ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తామని, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ప్రకటించారు. 

ఆర్థిక ఇబ్బందులున్నా...

రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని భట్టి తెలిపారు. రూ.2,500 కోట్లు ఖర్చుచేసి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామనీ, రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరింపచేశామని, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటనకు వెళ్లి రూ.36 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని పేర్కొన్నారు.

టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని చెప్పారు. సింగరేణి కార్మికులకు రూ.కోటి, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.30 లక్షల బీమా కల్పించామని గుర్తుచేశారు. రాష్ట్రంలో మరో రూ.4 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, మహిళా సంఘాలకు ఇందు లో ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. 

రుణమాఫీ చేసి తీరుతాం : శ్రీధర్‌బాబు

రాష్ట్రంలోని రైతులకు వంద శాతం రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని సూచించారు. సింగరేణి ప్రజలు ఎంతో కష్టపడి పనిచేస్తేనే దేశంలో, రాష్ట్రంలో వెలుగులు ఉంటాయని అన్నారు. ఒక్కరోజే ఇక్కడ ౮ వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయడం సంతోషకరంగా ఉందని మంత్రి చెప్పారు. 

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కీలకం : పొన్నం

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి ప్రజలు కీలక పాత్ర పోషించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సింగరేణి ప్రాంత ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని చెప్పారు. తెలంగాణ వస్తే సింగరేణి ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి, బెల్లంపల్లి, చెన్నూరు, పెద్దపల్లి ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వినోద్, వివేక్, విజయరమణారావు, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, మేయర్ బంగి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు